ఇండియాలో రష్యా వ్యాక్సిన్ "స్పుత్నిక్ వి" ప్రయోగాలకు రంగం సిద్ధం...
రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్), గమాలెయా సంస్థలు సంయుక్తంగా ‘స్పుత్నిక్ వి’ (Sputnik V) వ్యాక్సిన్‌ను తయారు చేశాయి. కరోనా మహమ్మారికి ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్‌గా ఇది గుర్తింపు పొందింది. ఆగస్టు 11న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కుమార్తెకు తొలి డోసు అందించారు. ఈ మేరకు పుతిన్ ఈ టీకాకు సంబంధించిన ప్రకటన చేశారు. ఎంతోమంది పరిశోధకుల అధ్యయనంలో వారి నిరంతర కృషితో చేసిన ప్రయోగాలు విజయవంతమైన తర్వాత డాక్టర్ రెడ్డీస్‌కు రష్యా సంస్థ 100 మిలియన్ డోసుల కరోనా వ్యాక్సిన్‌ను అందజేస్తుంది. ఈ మేరకు రష్యాకు చెందిన ఆర్డీఐఎఫ్తో డాక్టర్ రెడ్డీస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. కొవిడ్-19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ, పంపిణీ ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో ప్రారంభం కానున్న ఈ టీకా ప్రయోగాలు విజయవంతం కావాలని అతి త్వరలోనే దేశ ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.