నిద్రపోయే ముందు.. ఈ పనులు అస్సలు చేయకండి.. డేంజర్‌..?

Chakravarthi Kalyan
మనిషి అలవాట్లే అతని ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఆరోగ్యవంతమైన మనిషికి నిద్ర ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వేళకు సరిగ్గా నిద్రపోతేనే.. పగలు హుషారుగా ఉంటాం. అనేక మంది రాత్రిపూట భోజనం చేసిన తర్వాత చాలాసేపటికి నిద్రపోతారు. ఈ మధ్య సమయంలో చేసే కొన్ని పనులు నిద్రకు భంగం కలిగించడమే కాదు.. అనారోగ్యానికి దారితీసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.


మరి ఆ చేయకూడని పనులేవో.. తెలుసుకొని, వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మరి రాత్రి సరిగ్గా నిద్రపట్టాలంటే.. ఏం చేయాలి.. ఏం చేయకూడదు ఓసారి చూద్దాం.. నిద్ర సరిగ్గా రావాలంటే.. రాత్రివేళ టీ, కాఫీ లకు దూరంగా ఉండాలి. కొంతమంది రాత్రి పడుకునేముందు టీ, కాఫీ తాగడానికి ఇష్టపడతారు. మరికొంతమంది చాక్లెట్లు తింటుంటారు. ఈ అలవాట్లు మంచివి కావు. టీ, కాఫీ, చాక్లెట్లలో కెఫిన్‌ ఉంటుంది. ఇది మనుషుల నిద్రకు ఆటంకం కలిగించడంతో పాటు నిద్రకు సంబంధించి అనేక సమస్యలకు కారణమవుతుంది. అందుకే తిన్న తర్వాత.. పడుకునే ముందు వీటిని అస్సలు తీసుకోవద్దు.


కొందరు సరిగ్గా పడుకునే ముందు నిద్ర రావడం లేదు కదా.. అని టైంపాస్‌ కోసం కొన్ని పనులు చేస్తారు. అవి కాస్తా.. నిద్రను మరింత దూరం చేస్తాయి. నిద్రపోయే ముందు కొత్త విద్యలు నేర్చుకోవడం, రాయడం, డ్రాయింగ్‌ వేయడం వంటివి అసలు చేయకూడదు. ఇలాంటి సృజనాత్మక పనులు చేసే సమయంలో మెదడుపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు నిద్ర వచ్చే అవకాశం ఉండదు.  మెదడుకు పని తగలడంతో నిద్ర దూరమవుతుంది. సరిగా నిద్రపోకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఇలాంటి పనులకు దూరంగా ఉండండి. మెదడుకు కాస్త విశ్రాంతి ఇస్తేనే హాయిగా నిద్రపోగలం కదా.  

అలాగే రాత్రి 8 గంటల తర్వాత ఎక్కువగా నీరు తాగొద్దు. ఎక్కువగా తాగడం వల్ల అర్ధరాత్రి పలుమార్లు మూత్రం వెళ్లాల్సి రావొచ్చు. దీంతో చక్కటి నిద్రకు భంగం వాటిల్లుతుంది. ఈ సమస్యలు రావొద్దంటే రాత్రిపూట నీరు ఎక్కువగా తాగకండి. ఈ సలహాలు పాటించి చూడండి.. మిమ్మల్ని నిద్రాదేవి వరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: