దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తూనే ఉంది. గత ఏడాది కాలంగా మహమ్మారి వైరస్ ఎంతోమంది ప్రజలను పొట్టన పెట్టుకుంది. ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. అయితే కరోనా కారణంగా మానవాళి మాత్రమే కాకుండా ఇప్పుడు జంతువులు సైతం ఇబ్బంది పడటం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే కరోనా బారిన పడి రెండు సింహాలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇప్పటికీ సింహాలు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక తాజాగా నాలుగు సింహాలలో డెల్టా వేరియంట్ ను గుర్తించారు. చెన్నైలోని మందలూరు ప్రాంతంలో ఉన్న అరినగర్ అన్నా జూలాజికల్ పార్క్ లోని నాలుగు సింహాల కు కరోనా డెల్టా వేరియంట్ వచ్చినట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించడం జరిగింది.
ఈ విషయాన్ని జూలాజికల్ పార్క్ అధికారులు స్పష్టం చేశారు. మొత్తం 11 సింహాలకు సంబంధించిన శాంపుల్స్ ను నిషాద్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్) కు జూ అధికారులు మే 24న పంపించారు. అయితే మే 29న అందులో 9 సింహాలకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు రిపోర్ట్ లు వచ్చాయి. వాటిలో లో ఏ సింహానికి వేరియంట్ సోకింది అనే విషయాన్ని తాజాగా వెల్లడించారు. దాంతో ప్రస్తుతం సింహాలకు వేర్వేరుగా చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ సింహాలను సందర్శకులకు దూరంగా ఐసో లేషన్ లో చికిత్స అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే కరోనా సాధారణ వేరియంట్ కంటే డెల్టా వేరియంట్ ప్రమాదకరమని, అంతేకాకుండా వేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే. డెల్టా వేరియంట్ ఇప్పటికే మానవులలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దాంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు వైద్యులు హెచ్చరిస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం లాక్ డౌన్ తొలగించడంతో స్వతంత్య్రం వచ్చినట్టు భావిస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా రోడ్లపైకి వస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన కల్లోలాన్ని అప్పుడే మర్చిపోయారు. ఇక మనుషుల పరిస్థితి ఇలా ఉంటే నోరులేని జంతువులను సైతం ఇప్పుడు మహమ్మారి వెంటాడటం ఆందోళనకరం.