
ఒమిక్రాన్ : విజృంభిస్తే వారికి ప్రమాదం తప్పదా..?
వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగితే దాని ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతుందని, వైద్య రంగంపై పెనుభారం పడుతుందని ఫలితంగా ఆ రంగం ఇబ్బందుల్లో పడిపోతున్నదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఇవాళ నుంచి దేశంలో 15 సంవత్సరాల వయస్సు నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ అందిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగానే ఇప్పటికే మూడవ వేవ్ సంకేతాలు వస్తున్నట్టు దేశంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీలో పాజిటివిటీ రేటు కూడా రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంది. వారం రోజుల క్రితం 0.5 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ఇప్పుడు 4.59 శాతానికి చేరుకున్నది. ఇది 5 శాతానికి చేరితే రెడ్ అలెర్ట్ ప్రకటించక తప్పదు. మొత్తానికి దేశవ్యాప్తంగా కర్య్పూ విధించే అవకాశం కూడా రావోచ్చనే ఊహగానాలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీతో పాటు ముంబై నగరంలో కూడా పాజిటివిటీ రేటు విపరీతంగా పెరుగుతుంది. దేశవ్యాప్తంగా చూసినట్టయితే కరోనా కేసులు గతంలో మహారాష్ట్రలోనే అధికంగా ఉండేవి. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు కూడా ముంబై నగరంలోనే ఎక్కువ ఉండడం విశేషం. ముంబైలో మొత్తం 510 ఒమిక్రాన్ కేసులు ఉండగా.. ఢిల్లీలో 351 ఒమిక్రాన్ కేసులున్నాయి. దేశం మొత్తం మీద ఇప్పటివరకు 1700 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరగడానికి ఒమిక్రాన్ వేరియంట్ ప్రధాన కారణం అవ్వడంతో అన్ని రాష్ట్రాలు ఇప్పటికే తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాయి.