ఎండాకాలంలో 'గుండె జబ్బులు' ఉన్నవారికి హెచ్చరిక ?
ఈ వేసవి కాలంలో మండుతున్న ఉష్ణోగ్రత లకు మన శరీరం లోని నీరు, లవణాలు కూడా ఎక్కువగా బయటకు వెళ్లి పోతుంటాయి. ఆరోగ్యాంవతులకు అయితే ఒక రకంగా సమస్య కాదుకానీ, గుండె జబ్బులు ఉండే వారికి మాత్రం ఇది సమస్యాత్మకమే అంటున్నారు వైద్యులు. నీరు, లవణాలు శరీరం నుండి బయటకు వెళ్లిపోవడం వలన రక్తం బాగా చిక్కబడి గుండె పోటుకు దారి తీసే అవకాశం ఉంది అంటున్నారు వైద్యులు. అందుకని వేసవి కాలం ఎక్కువగా నీటిని తాగుతుండాలి. అలాగే ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయట తిరగకుండా జాగ్రత్త పడాలి. ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి అని చెబుతున్నారు.
ఎండాకాలంలో శరీర ఉష్ణోగ్రత కంటే కూడా బయట వేడి ఎక్కువగా ఉన్న కారణంగా వెంటనే మనకు ఎక్కువగా చెమటలు పట్టేస్తాయి. దీని వలన రక్తనాళాలు కూడా విప్పారుతాయి. తద్వారా శరీర ఉష్ణోగ్రత నిలకడగా ఉంటుంది.
కానీ ఈ క్రమంలో గుండె కొట్టుకొనే వేగం బాగా పెరుగుతుంది. రక్త పీడనం కూడా బాగా తగ్గుతుంది. సాధారణ ఆరోగ్యవంతులకు ఇలాంటి పరిస్థితి వలన పెద్దగా ప్రభావం ఉండదు. కానీ గుండె జబ్బులతో బాధపడే వారికి మాత్రం ఈ పరిస్తితి సంకటంగా మారే అవకాశం ఉందట. వేగంగా కొట్టుకునే గుండె, తగ్గిన బీపీతో గుండె నుంచి రక్తప్రసరణ బాగా తగ్గి .... గుండె విఫలమయ్యే ప్రమాదం అధికంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కావున వీలయినంత వరకు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు నీడపట్టున ఉండండి.