మనకు రెస్టారెంట్ లలో లభించే వివిధ రకాల రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన సూప్ లల్లో వెజ్ సూప్ కూడా ఒకటి. వెజ్ సూప్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. స్టాటర్ గా దీనిని చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ సూప్ ను తాగడం వల్ల చాలా హాయిగా ఉంటుంది. ఇక ఈ సూప్ ను అదే రుచితో రెస్టారెంట్ స్టైల్ లో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ సూప్ ను తయారు చేయడం కూడా చాలా సులభం. ఎవరైనా దీనిని చాలా తేలికగా ఇంట్లోనే తయారు చేసి తీసుకోవచ్చు.ఇక రెస్టారెంట్ స్టైల్ లో హాట్ వెజ్ సూప్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇక వెజ్ సూప్ తయారీకి కావల్సిన పదార్థాల విషయానికి వస్తే..నూనె 2 టీస్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి 2,నీళ్లు 350 ఎమ్ ఎల్, సన్నని క్యాబేజి తురుము పావు కప్పు, బీన్స్ తరుగు 2 టీ స్పూన్స్, క్యారెట్ తరుగు 2 టేబుల్ స్పూన్స్, మష్రూమ్ తరుగు 2 టేబుల్ స్పూన్స్, బేబికార్న్ సన్నని తరుగు 2 టేబుల్ స్పూన్స్, డార్క్ సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్, ఆరోమెటిక్ పౌడర్ ఒక టీ స్పూన్, పంచదార అర టీ స్పూన్, వైట్ పెప్పర్ పౌడర్ అర టీ స్పూన్, చిల్లీ పేస్ట్ ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, కార్న్ ఫ్లోర్ 2 టీ స్పూన్స్, వెనిగర్ ఒక టీ స్పూన్, స్ప్రింగ్ ఆనియన్స్ 2 టీ స్పూన్స్ తీసుకోవాలి.
ఈ వెజ్ సూప్ తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా మీరు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. ఆ తరువాత పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఆ తరువాత అందులో నీళ్లు పోసి కలపాలి. తరువాత కూరగాయల ముక్కలన్నీ కూడా వేసి ఉడికించాలి. ఆ ముక్కలు ఉడికిన తరువాత సోయా సాస్, ఆరోమెటిక్ పౌడర్, పంచదార, వైట్ పెప్పర్ పౌడర్, చిల్లీ పేస్ట్ ఇంకా ఉప్పు వేసి కలపాలి.ఇక వీటిని ఒక నిమిషం పాటు మరిగించిన తరువాత కార్న్ ఫ్లోర్ లో పావు కప్పు నీళ్లు పోసి కలిపి ఆ సూప్ లో వేసుకోవాలి. దీనిని చిక్కబడే దాకా మరిగించిన తరువాత వెనిగర్ వేసి కలపాలి. చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకుని స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉండే వెజ్ సూప్ తయారవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ సూప్ ను అందరూ చాలా ఇష్టంగా తాగుతారు.