బట్టతలకి శాశ్వత పరిష్కారం దొరికేసినట్టేనా.. శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణ..!

praveen
వంశపారంపర్య బట్టతల.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని వేధిస్తున్న సమస్య. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో షెఫీల్డ్ (యూకే), కామ్సాట్స్ (పాకిస్తాన్) యూనివర్సిటీల శాస్త్రవేత్తలు సంచలన ఆవిష్కరణ చేశారు. డిఆక్సీరైబోస్ అనే సహజ చక్కెరతో బట్టతలకు చెక్ పెట్టవచ్చని కనుగొన్నారు. ఈ చక్కెర మన శరీరంలోనే ఉంటుంది, డీఎన్ఏ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. శాస్త్రవేత్తలు ఎలుకల చర్మ గాయాలపై డిఆక్సీరైబోస్ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి పరిశోధనలు చేసినప్పుడు ఈ కొత్త ఆవిష్కరణ జరిగింది. గాయాలు త్వరగా మానడమే కాకుండా, ఆ ప్రదేశంలో వెంట్రుకలు కూడా ఒత్తుగా పెరగడం చూసి ఆశ్చర్యపోయారు. దీంతో డిఆక్సీరైబోస్ జుట్టు పెరుగుదలను కూడా ప్రేరేపిస్తుందా అనే కోణంలో పరిశోధనలు మొదలుపెట్టారు.
ఫలితం ఊహించిన దానికంటే అద్భుతంగా వచ్చింది. జూన్‌లో జరిగిన అధ్యయనంలో డిఆక్సీరైబోస్.. జుట్టు రాలడానికి ప్రస్తుతం వాడుతున్న మినోక్సిడిల్ అనే ఔషధంలాగే సమర్థవంతంగా పనిచేస్తుందని తేలింది. పైగా ఇది సహజమైనది కావడం విశేషం. డిఆక్సీరైబోస్ జుట్టు కుదుళ్లకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
పురుషుల్లో బట్టతల అనేది చాలా సాధారణ సమస్య అని షెఫీల్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షీలా మాక్‌నీల్ అన్నారు. ప్రస్తుతం దీనికి FDA ఆమోదించిన చికిత్సలు రెండే ఉన్నాయి. అయితే, డిఆక్సీరైబోస్ అనే సహజ చక్కెర జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను పెంచి, జుట్టు తిరిగి పెరగడానికి సహాయపడుతుందని ఆమె తెలిపారు. ఇది చాలా సులభమైన, సహజమైన పద్ధతి అని ఆమె వివరించారు. ఈ పరిశోధన ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, ఫలితాలు మాత్రం చాలా ఆశాజనకంగా ఉన్నాయి.
కామ్సాట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ముహమ్మద్ యార్ మాట్లాడుతూ, డిఆక్సీరైబోస్ అనేది స్థిరమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న చక్కెర అని, దీనిని జెల్స్ లేదా డ్రెస్సింగ్‌ల రూపంలో సులభంగా ఉపయోగించవచ్చని తెలిపారు. దీనివల్ల జుట్టు రాలడానికి చికిత్స కోసం ఇది మరింత అనుకూలమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న ఎంపిక అవుతుందని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: