బ్యూటీ పార్లర్ కు వెళ్లకుండానే అందంగా కనిపించాలా.. ఈ చిట్కాలు పాటించాల్సిందే!

Reddy P Rajasekhar

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో అందం కోసం గంటల తరబడి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అయితే ఖరీదైన క్రీములు, ఫేషియల్స్ అవసరం లేకుండానే ఇంట్లో దొరికే సహజసిద్ధమైన వస్తువులతో మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవడం చాలా సులభం. ముఖంపై నిగారింపు కోసం మనం రోజూ వాడే పాలు, తేనె, శనగపిండి అద్భుతంగా పనిచేస్తాయి.

ఒక స్పూన్ శనగపిండిలో కొద్దిగా పెరుగు, చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత కడిగేస్తే చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి ముఖం తాజాగా కనిపిస్తుంది. అలాగే చర్మం పొడిబారకుండా ఉండాలంటే కలబంద (అలోవెరా) జెల్ లేదా కొబ్బరి నూనెను రాత్రి పడుకునే ముందు రాసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. టొమాటో రసం లేదా నిమ్మరసం వాడటం వల్ల చర్మంపై ఉన్న నల్లటి మచ్చలు క్రమంగా తగ్గుతాయి.

కేవలం పైపూతలతోనే కాకుండా, అంతర్గత ఆరోగ్యం కూడా ముఖ వర్చస్సుపై ప్రభావం చూపుతుంది. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి చర్మం సహజంగానే కాంతివంతంగా తయారవుతుంది. ఆహారంలో తాజా పండ్లు, ఆకుకూరలు చేర్చుకోవడం వల్ల విటమిన్లు అంది జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి.

కంటి కింద నల్లటి వలయాలు రాకుండా ఉండాలంటే రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర తప్పనిసరి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిన్నపాటి వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి ముఖంలో కొత్త కళ వస్తుంది. బయటకు వెళ్లేటప్పుడు ఎండ తగలకుండా గొడుగు లేదా స్కార్ఫ్ వాడటం, రసాయనాలు తక్కువగా ఉండే సోపులను ఎంచుకోవడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే బ్యూటీ పార్లర్ అవసరమే లేకుండా ఎల్లప్పుడూ అందంగా, ఆకర్షణీయంగా కనిపించవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శరీరంపై కెమికల్స్ ప్రభావం లేకుండానే అందంగా కనిపించే ఛాన్స్ అయితే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: