క్యాన్సర్ లక్షణాలను గుర్తించాలంటే చేయించుకోవాల్సిన పరీక్షలివే.. ఈ విషయాలు తెలుసా?
క్యాన్సర్ అనేది శరీరంలోని కణాల అసాధారణ పెరుగుదల వల్ల వచ్చే వ్యాధి. దీనిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభం కావడమే కాకుండా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. చాలా మందికి క్యాన్సర్ లక్షణాలపై అవగాహన ఉన్నప్పటికీ, ఏ పరీక్షలు చేయించుకోవాలో తెలియక తికమకపడుతుంటారు. సాధారణంగా మన శరీరంలో వచ్చే మార్పులను గమనిస్తూ, అనుమానం కలిగినప్పుడు వైద్యులను సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోవడం ఎంతో కీలకం.
మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, 40 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా 'మామోగ్రామ్' పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. అలాగే గర్భాశయ క్యాన్సర్ ముప్పును ముందుగానే పసిగట్టడానికి 'ప్యాప్ స్మియర్' (Pap Smear) పరీక్ష ఎంతో సహాయపడుతుంది. పురుషుల విషయానికి వస్తే, వయసు పెరిగే కొద్దీ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని గుర్తించడానికి 'PSA' (Prostate-Specific Antigen) రక్త పరీక్ష చేస్తారు. జీర్ణవ్యవస్థ లేదా పేగులకు సంబంధించిన సమస్యలను గుర్తించడానికి 'కొలోనోస్కోపీ' పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణకు చెస్ట్ ఎక్స్-రే లేదా లో-డోస్ సీటీ స్కాన్ అవసరమవుతాయి.
వీటితో పాటు ప్రాథమికంగా చేసే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (CBP) వంటి రక్త పరీక్షలు కూడా రక్త క్యాన్సర్ వంటి ఇతర సమస్యల పట్ల ప్రాథమిక సమాచారాన్ని అందిస్తాయి. శరీరంలో ఎక్కడైనా గడ్డలు ఉన్నా లేదా పుట్టుమచ్చల రంగు మారుతున్నా వెంటనే బయాప్సీ (Biopsy) చేయించుకోవడం ద్వారా అవి క్యాన్సర్ కణాలా కాదా అనేది కచ్చితంగా తెలుసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కేన్సర్ కారకాలను గుర్తించే 'ట్యూమర్ మార్కర్స్' పరీక్షలను కూడా వైద్యులు సూచిస్తారు. పైన పేర్కొన్న పరీక్షలన్నీ కేవలం వ్యాధి ఉన్నప్పుడే కాదు, ముందు జాగ్రత్తగా హెల్త్ చెకప్ రూపంలో చేయించుకోవడం వల్ల ముప్పును ముందే నివారించవచ్చు. మీ వయసు, జీవనశైలి మరియు కుటుంబ చరిత్ర ఆధారంగా ఏ పరీక్ష ఎప్పుడు చేయించుకోవాలో ఒకసారి మీ ఫ్యామిలీ డాక్టర్‌తో చర్చించడం ఎంతో మంచిది.