చరిత్రలో ఈరోజు... ఇజ్రాయెల్ ఆవిర్భావం
ప్రపంచంలో ఎక్కువమంది మేధావులకు, సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు పుట్టినిల్లుగా చెప్పబడే ఇజ్రాయెల్ రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1948 మే 14వ తేదీన ఏర్పాటైంది. మనదేశంలోని కేరళ రాష్ట్రం కంటే చిన్నదైన ఈ దేశం అగ్రరాజ్యాలతో పోటీపడే స్థాయికి ఎదిగింది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ పనితీరుపై అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌లాంటి దేశాలే ఆశ్చర్యపోతుంటాయి. ఈ దేశ జనాభా దాదాపు 72.8 లక్షలుగా ఉంది. యూదులకు ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క ప్రదేశం.. ఇజ్రాయెల్. సమారిటన్‌లు, అరబ్బులు మైనారిటీ మతస్తులుగా ఉన్నారు.
ఏడాది పాటు వీరోచితంగా పోరాడిన ఇజ్రాయెల్
ఒట్టోమన్ సామ్రాజ్యం పరిధిలో ఉండే ఇజ్రాయెల్ టర్కీ అధీనం కింద ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ ఓటమిపాలైన తర్వాత ఈ ప్రాంతాన్ని బ్రిటన్ ఆక్రమించుకుంది. యునైటెడ్ స్టేట్స్, సోవియట్ యూనియన్ రెండు కొత్త శక్తులుగా అవతరించిన తర్వాత జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ నష్టపోయింది. 1945 లో బ్రిటన్ ఈ ప్రాంతాన్ని ఐక్యరాజ్యసమితికి అప్పగించింది. 1947 లో ఐక్యరాజ్య సమితి ఈ ప్రాంతాన్ని రెండు భాగాలుగా విభజించగా.. ఒకటి అరబ్ రాష్ట్రంగా, రెండోది ఇజ్రాయెల్‌గా ఏర్పడ్డాయి. జెరూసలేం నగరాన్ని అంతర్జాతీయ ప్రభుత్వ పరిధిలో ఉంచారు. ఇది జరిగిన సంవత్సరం తర్వాత ఇజ్రాయెల్ తన స్వతంత్రాన్ని ఇదేరోజు ప్రకటించుకుంది. ఇజ్రాయెల్ స్వాతంత్ర్యం ప్రకటించుకున్న 24 గంటల్లోనే అరబ్ దేశాల ఉమ్మడి దళాలు దాడికి పాల్పడ్డాయి. ఇజ్రాయెల్ ధైర్యాన్ని కోల్పోకుండా ఏడాది పాటు వీరోచితంగా పోరాడి విజయం సాధించింది.
1949 జనవరి 25న మొదటి ఎన్నికలు
అరబ్ సైన్యంతో యుద్ధం ముగియడంతో 120 మంది సభ్యుల ఇజ్రాయెల్ పార్లమెంటుకు మొదటి ఎన్నికలు 1949 జనవరి 25 న జరిగాయి. డేవిడ్ బెన్ గురియన్ ఆ దేశపు మొదటి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి పార్లమెంట్‌కు ఎన్నికలు జరుగుతుంటాయి. మెజార్టీ పార్టీ నేత ప్రధానమంత్రిగా ఎన్నికవుతారు. ఇప్పటి వరకు ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వాలే రాజ్యమేలాయి. ఇజ్రాయిల్‌లో 18 లక్షల మంది అరబ్బు ముస్లింలు ఉన్నారు. వారు అరబ్ లేదా పాలస్తీనా గుర్తింపు కలిగివుండటంతోపాటు ఇజ్రాయెల్ పౌరసత్వం కూడా ఉంది. ఇజ్రాయెల్ జనాభాలో అరబ్బులు 21 శాతంగా ఉంటారు. యూదులు, అరబ్బులు పక్కపక్కనే నివసిస్తున్నప్పటికీ పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్ అరబ్బులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుండటం తరుచుగా వివాదాలకు దారితీస్తుంటుంది.