హైదరాబాద్ లో నెత్తుటి గాయానికి పధ్నాలుగేండ్లు

Mekala Yellaiah
ఆగస్టు 25, 2007 రాత్రి 7.45 గంటలకు హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ లుంబినీపార్కులో ఒక లేజర్ షో నడుస్తోంది. హైదరాబాద్ చరిత్ర, దాని గొప్పతనాన్ని వివరిస్తూ ఆ షో కొనసాగుతోంది. ప్రజలు ఆ విశిష్టతను ఆసక్తిగా చూస్తున్నారు. అంతలోనే పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. క్షణల్లోనే తొమ్మిది మంది మృతిచెందారు. ఇదే సమయంలో కోఠీలోని గోకుల్ చాట్ లో మరో బాంబు పేలింది. అక్కడ 33 మంది చనిపోయారు. ఏకకాలంలో జరిగిన ఈ రెండు పేలుళ్లలో 42 మంది చనిపోగా, 300 మంది గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నగరంలోని రద్దీ ప్రాంతాలనన్నిటినీ సోదా చేశారు. మరో 19 బాంబులను గుర్తించి, పేలకుండా నిర్వీర్యం చేశారు. అనంతరం ఏడుగురు నిందితులను గుర్తించి, 1125 పేజీలు గల మూడు చార్జిషీట్లను దాఖలు చేశారు. 286 మందిని సాక్షులుగా చేర్చారు. మక్కాలో పేలుళ్ల తరువాత పోలీసులు జరిపిన కాల్పులకు ప్రతీకారంగా హైదరాబాద్ లో నిందితులు పేలుళ్లు జరిపినట్టు విచారణలో తేలింది.
దీని వెనుక తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ హస్తం ఉన్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. అయితే నిందితులను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ఎండీ సిద్దిక్ ఇస్సార్ అహ్మద్, ఎండీ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అనిక్ షఫిఖ్ సయ్యద్, ఫారుఖ్ షర్ఫుద్దీన్ తార్కష్ అనే నిందితులను పట్టుకున్నారు. అనంతరం ఆక్టోపస్ విభాగం, కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారులు పీడీ యాక్టు కింద ముంబయి పోలీసుల నుంచి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, నాంపల్లి కోర్టులో చార్జిషీట్లు దాఖలు చేశారు. ఈ చార్జిషీట్లలో ఐఎంకు చెందిన రియాజ్ భత్కల్, అక్బర్, అనీఖ్, ఇక్బాల్ భత్కల్, అమీర్ రజాఖాన్, ఫారూఖ్ తర్ఖాష్, సాదిక్ షేక్ ను నిందితులు చేర్చారు. టిఫిన్ బాక్సుల్లో బాంబులను ఉంచి, వాటికి టైమర్లను అమర్చి పేలుళ్లు జరిపారని దర్యాప్తు అధికారులు తెలిపారు.
ఈ జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. 2018లో చివరి తీర్పు వెల్లడించింది. నిందితుల్లో అనిక్ షఫిఖ్ సయ్యద్, ఎండీ అక్బర్ ఇస్మాయిల్ చౌదరీకి ఉరిశిక్ష విధించింది. నిందితులకు ఆశ్రయం కల్పించిన మరో వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. అయితే ఇద్దరు నిందితులకు విధించిన ఉరిశిక్ష ఇప్పటికీ అమలు కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: