బుడుగు : మీ పిల్లలు సరిగ్గా తిండి తినకపోతే ఇలా చేయండి..!
సాధారణంగా పిల్లలు భరించలేనంతగా అల్లరి చేస్తుంటారు. అదే విధంగా తిండి విషయంలోనూ బాగా మారం చేస్తుంటారు.అది తినను ఇది తినను అని తినడం మానేస్తారు. కొంతమంది పిల్లలు అయితే కొన్ని కొన్ని పదార్ధాలు మాత్రమే తింటారు. అదే అలవాటు పెద్దయ్యాక కూడా వస్తుంది. కావున చిన్నప్పుడే పిల్లలకు అన్ని ఆహారపదార్దాలను తినడం అలవాటు చేయాలి. అలాగే పిల్లల్లో ఆహారపు అలవాట్లలో సైతం బాగా మార్పులు చూస్తుంటాం. అలాంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తిండి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది లేకుంటే పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే క్రింద పేర్కొన్న ఈ చిట్కాలను పాటిస్తే పిల్లలకు తిండిపై ఆసక్తి కలుగుతుంది.
ఎప్పుడూ కూడా పిల్లల ముందు బరువు గురించి మాట్లాడొద్దు.ఎక్కువ తింటే బరువు పెరుగుతారు అన్న మాటలు వాళ్ళ ముందు అన్న వాళ్ళు తినడం మానేస్తారు. మంచి ఆహారాన్ని ఎంపిక చేసుకునే అవకాశం పిల్లలకే ఇవ్వాలి. పిల్లలకు పండ్లను అందుబాటులో ఉంచాలి. కనీసం రోజుకు ఏదన్నా ఒక పండు పెట్టాలి.అరటికాయనో లేక దానిమ్మ, ద్రాక్ష, ఆపిల్, మామిడి, ఆరెంజ్, స్ట్రా బేరీ, రేగిపండ్లు, నేరేడు, పనస తొనలు, సపోటా ఇలా చాలా రకాల పండ్లు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. కనుక పిల్లలకు ఎదో ఒక పండ్లు పెడుతూ ఉంటే పోషకాలు లభిస్తాయి. జంక్ ఫుడ్, కూల్‌డ్రింక్స్ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియజేయాలి.ఆహార పదార్థాల్లో ఏది మంచో, ఏది చెడ్డదో వివరించాలి.
వంటగదిలో పోషకాలను అందించే స్నాక్స్ తినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంచండి.ఎందుకంటే పిల్లలకు ఎప్పుడు ఆకలివేస్తుందో తెలియదు. ఆరోగ్యానికి హానిచేసే పదార్థాలను మార్కెట్‌లో కొనుగోలు చేయకపోవడమే మంచిది.పిల్లలతో కలిసి భోజనం చేయాలి.పాప్ కార్న్, తృణధాన్యాలు, బ్రెడ్ అండ్ బట్టర్‌ను అందుబాటులో ఉంచాలి. వంట గురించి చర్చించేటప్పుడు పిల్లలతో మాట్లాడాలి. తినేటప్పుడు ఏ పదార్థం ఎలాంటి మేలు చేస్తుందో వివరించాలి.ఓపికగా మంచి భోజనం ఎంచుకునే అలవాట్లను నేర్పించాలి.