బుడుగు : వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యం జరా జాగ్రత్త... !!
వేసవికాలపు ఎండలతో విసుగుచెంది ఉన్న సమయంలో తొలివర్షం ఎంతో ఉపశమనం ఇస్తుంది. వర్షాలు కొనసాగితే వాతావరణం పూర్తిగా చల్లబడటంతోపాటు చుట్టూ ఆకుపచ్చదనం పెరిగి కళ్లకు, మనస్సకు ఆహ్లాదంకలుగుతుంది. కానీ పసిపిల్లలు ఉన్న కుటుంబాలకు ఇప్పుడే క్లిష్ఠసమయమూ మొదలవుతుంది. వర్షాల వల్ల వాతావరణంలో తేమ పెరగటం, వర్షపు నీటి ప్రవాహంతో కొట్టుకువచ్చే చెత్తాచెదారం, చిన్నచిన్న గుంతలు, లోతట్టు ప్రాంతాలలో నిలిచే వర్షపు నీరు వ్యాధులకు కారణమైన వైరసులు, బాక్టీరియాల పెరుగుదల చెంది వ్యాప్తికి కారణం అవుతాయి.
వీటితో వర్షాకాలంలో పసిపిల్లలకు రాగల వ్యాధులు, ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను గూర్చి తెలుసుకుని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోగలిగితే పసిప్రాణాలను ఇబ్బందులు పెట్టే, కొన్నిసార్లు తీవ్రమైన వ్యాధులకు దారితీయగల పరిస్థితిని విజయవంతగా
ఎదుర్కోగలుగుతాం.వర్షాకాలంలో చాలామంది పిల్లలు విరేచనాలు, జలుబు, శ్వాససంబంధమైన సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అందువల్ల వైద్యులు చెప్పిన విధంగా పసిపిల్లల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ. హెచ్. ఓ.) అంచనాల ప్రకారం విరేచనాల(డయేరియా) కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏడు ఏడు లక్షల అరవై వేల మంది అయిదు సం.లకు లోపు పిల్లలు చనిపోతున్నారు.
కొద్దిపాటి జాగ్రత్తలతో మరణాలు అరికట్టవచ్చు. విరేచనాలు, టైఫాయిడ్ వ్యాధులు త్రాగునీళ్లు, ఆహారం విషయంలో అపరిశుభ్రత వల్లనే వస్తాయి. అందువల్ల బాగా కాచివడబోసిన లేదా ఫిల్టర్ చేసిన మంచినీటిని మాత్రమే ఇవ్వాలి. వంటకు వాడే నీరు కూడా కలుషితంకానిది, శుభ్రమైనదిగా ఉండేట్లు చూసుకోవాలి. బయట నుంచి కొనితెచ్చిన పళ్లరసాలు, ఇతర తినుబండారాలు ఇవ్వకూడదు. పిల్లలకు సన్నిహితంగా మెలిగే పెద్దవాళ్లు సబ్బు లేదా హాండ్ వాష్ లిక్విడ్ తో తరచూ చేతిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి.పిలల్లకు ఏది పడితే అది పెట్టకూడదు. చిన్నపిల్లలు కూడా వర్షాకాలంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. వర్షం నీటిలో అసలు తడవనివ్వకూడదు.