బుడుగు: పిల్లలలో నైతిక విలువలను పెంపొందించడంలో తల్లి తండ్రుల పాత్ర.. !!
సాద్యమైనంత వరకూ అందరూ కలసి భోజనం చేసేలా చూడాలి. టీ.వీ. చూస్తూ భోజనం చేయడం మంచిది కాదు, దీనికి బదులు ఆరోజు జరిగిన విశేషాలను కుటుంబంలో అందరూ కలిసి పంచుకొంటూ భోజన సమయాన్ని గడపవచ్చు. పిల్లలను వారి స్కూల్లో ఆరోజు జరిగిన విశేషాలను మాట్లాడమని ప్రోత్సహించాలి.. అలాగే క్రింద పడకుండా శుభ్రంగా భోజనం చేయడం, భోజనం ముందూ, తరువాతా శుభ్రంగా చేతులు కడుక్కోవడం వంటి మంచి అలవాట్లు నేర్పించాలి.
పిల్లల వ్యక్తిగత అభిరుచులూ, ఆసక్తిని కూడా తల్లిదండ్రులు గమనించాలి. ఆయా నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రోత్సహించాలి. పిల్లలకు బొమ్మలు వేయడం, రంగులు వేయడం ఇష్టమైతే బజారులో దొరికే కొత్తరకాల రంగులూ, బొమ్మల పుస్తకాల వంటివి కొని వారిని ప్రోత్సహించవచ్చు. బొమ్మల పోటీలు నిర్వహించే ప్రదేశాలకు వారిని తీసుకెళ్ళి వాటిలో పాల్గొనేలా ప్రోత్సహించాలి. అలాగే మన అభిరుచులను వారిపైకి రుద్దకుండా స్వతహాగా వారిలో ఉండే ఆసక్తులను గమనించి ప్రోత్సహించాలి. దీనివలన పిల్లలలో సృజనాత్మకత మెరుగవుతుంది. రకరకాల పోటీలలో పాల్గొని ముందుండే పిల్లలు చదువులో కూడా ముందుంటారు.