బుడుగు: చిన్న పిల్లలకు ఏర్పడే ప్రమాదాలు ఇవే..!

N.ANJI
చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే చిన్నారులకు అపాయాన్ని గురించి ఆలోచించే వయస్సుండదు. చిన్నారులను వేడి వస్తువుల దగ్గరకు రానీయకుండా, వంటింట్లో పరుగులు తీయకుండా చూసుకుంటుండాలి. వేడి నీళ్ళతో ఆడాలని చేయి పెట్టినా చేతులు కాలి, లేత చర్మానికి బొబ్బలొస్తాయి. వెంటనే పిల్లల చేతులు మీద ధారగా చన్నీళ్ళను పోయాలి. ఆ తర్వాత చల్లని నీళ్ళతో తడిపిన బట్టను చర్మం మీద ఉంచి, వెంటనే డాక్టర్‌ వద్దకు తీసుకెళ్ళాలి.

చిన్నపిల్లలున్న ఇంట్లో, ఆ టేబుల్‌ క్లాత్‌ను పిల్లలు లాగి, టేబుల్‌ మీద ఉం చిన పాత్రలను, వేడి పదార్థాలను మీద వేసుకునే ప్రమాదం ఉంటుంది. వారి చర్మం కాలే ప్రమాదముంటుంది. పిల్లలకు చర్మంకాలినప్పుడు చర్మం మీద చల్లటి నీటిని ధారగాపోయడమే సరైన పద్ధతి. తేనె పూయడం లాంటివి చేయకూడదు. డాక్టర్‌కు చూపించాలి. వెంటనే, బొబ్బలను చిదపకూడదు. చర్మాన్ని రబ్‌చేయకూడదు.

 కొన్ని రకాల కీటకాలలో కొంత విషపదార్థం ఉంటుంది. అటువంటి విషకీటకాలు కుడితే పిల్లలకు ఎలర్జీ కలిగి, ఆ తర్వాత కుట్టిన చర్మం మీద అమిత బాధకలుగుతుంది. గొంగళి పురుగులు లాంటివి కుడితే, చర్మం మీద పాకితే దురదలు, దద్దుర్లు వచ్చి పిల్లలకు బాధ కలుగుతుంది. అప్పుడు, గోరువెచ్చని నీటితో స్నానం చేయించి, దద్దుర్లు, దురద తగ్గటానికి గొంగళిపురుగు పాకిన ప్రదేశంలో విభూదిని బాగా రుద్దాలి.

ఇక కొన్ని విషకీటకాలు కుడితే ఎలర్జీ ఏర్పడటమే కాకుండా, మరికొన్ని తీవ్రమైన మార్పులు వస్తాయి. దద్దుర్లు ఎర్రగా మారినప్పుడు, ఊపిరి పీల్చుకోవడంతో ఇబ్బంది కలిగినప్పుడు పెదాలు నల్లబడటం, నాలుక తడారిపోవడం లాంటి లక్షణాలు ఏర్పడితే ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా పిల్లలను వైద్యుని వద్దకు తీసుకెళ్ళాలి. అవసరమైన వైద్య సహాయాన్ని పిల్లలకు అందించాలి.

పిల్లలు నేలమీద, మెట్లమీద నుంచి ఎత్తుగా ఉండే అరుగుల మీద నుండి జారిపడి దెబ్బలు తగుల్చుకోవచ్చు. దెబ్బ తగిలిన నొప్పికంటే, భయంతో పిల్లలు ఏడ్చేస్తారు. పిల్లల ఏడుపునకు కంగారు పడకూడదు. పిల్లలను భయపడవద్దని బుజ్జగిస్తూ, ఏం జరిగిందో, ఎక్కడ ఏవిధంగా పడిందీ, దెబ్బ ఎక్కడ తగిలిందీ తెలుసుకోవాలి. చర్మం చీరుకుపోయి రక్తం వస్తుంటే డెట్టాల్‌ నీటితో చర్మాన్ని శుభ్రంగా కడిగి, టించర్‌ను దూదితో అద్దాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: