బుడుగు: కరోనా సమయంలో పుట్టిన పిల్లల్లో తక్కువ ఐక్యూ ఉంటుందా..??

N.ANJI
కరోనా మహమ్మారి అందరి జీవితాలను తలకిందులు చేసింది. ఈ వైరస్ అందరి జీవితాలలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఇక ఇంటికే పరిమితం కావడంతో మానసికంగానూ విపరీతమైన ప్రభావం చూపుతుంది. అయితే అది పెద్దలకే పరిమితం కాదు.. శిశువులపై కూడా చాలా ఎఫెక్ట్ చూపుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాక.. కరోనా కాలంలో పుట్టిన కొందరు శిశువుల్లో ప్రస్తుతం ఐక్యూ స్థాయిలు తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఇక ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఓ నివేదికలో తెలిపారు. పిల్లలలో తెలివితేటల స్థాయులను ఐక్యూలో కొలుస్తున్నారు.
అయితే కరోనా కాలంలో పుట్టిన పిల్లల్లో అంతకు ముందు పుట్టిన పిల్లలతో పోలిస్తే తక్కువ ఐక్యూ ఉన్నట్టు గుర్తించామని బ్రౌన్ యూనివర్సిటీ పీడియాట్రిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ సీన్ డియోనీ వెల్లడించారు. అంతేకాక.. ఈ ప్రభావం సుదీర్ఘ కాలంలో ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందని ఇప్పుడే చెప్పలేమని పరిశోధకులు తెలిపారు. కాగా.. సాధారణంగా మూడు నెలలు, మూడు సంవత్సరాల మధ్య వయసు ఉండే పిల్లలల్లో ఐక్యూ స్కోరు దాదాపు 100 ఉంది. ఇక కరోనా సమయంలో పుట్టిన కొందరు పిల్లల్లో ఇది 78 మాత్రమే ఉన్నట్టు గుర్తించామని తెలిపారు.
ఇక పిల్లల్లో లోకజ్ఞానం పెరగడానికి మొదటి సంవత్సరాలు చాలా కీలకం అని తెలిపారు. అయితే కరోనా కారణంగా వ్యాపారాలు, నర్సరీలు, ప్లే గ్రౌండ్లు సహా అన్ని కార్యకలాపాలు ఆగిపోవడంతో పెద్దలు, పిల్లలు ఇళ్లకే పరిమితమైయ్యారు. దాంతో శిశువులు బయటి ప్రపంచాన్ని చూడలేకపోతున్నారు. అంతేకాక.. ఇంటికి సన్నిహితుల రాకపోకలు కూడా భారీగా తగ్గడం వల్ల కూడా వారిపై ప్రభావం చూపిస్తుంది. దీంతో పిల్లలతో మాట్లాడే వారు తక్కువై పోతున్నారు. ఇక ఫలితంగా మాటలను గ్రహించే శక్తి కూడా పిల్లల్లో మందగించి ఉంటుందని నివేదిక తెలియజేసింది.
అంతేకాదు.. ఇళ్లకే పరిమితం కావడమే పిల్లల్లో ఐక్యూ శాతం తగ్గడానికి కారణమని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. అయితే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని పరిశోధకులు తెలియజేశారు. ఇక భవిష్యత్తుపై ఇది ప్రభావం చూపుతుందా అన్నది ఇప్పుడే చెప్పలేమని నివేదికలో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: