కరివేపాకును వంటలలో వాడని మహిళ ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఈ కరివేపాకు చెట్టుకు శాస్త్రీయమైన పేరును స్వీడన్ దేశపు వృక్ష శాస్త్రవేత్త యోహాన్ ఏండ్రియాస్ మర్రే పేరు పెట్టారు. ఈ చెట్టు ఎక్కువగా కేవలం ఇండియా శ్రీలంకలో మాత్రమే కనిపిస్తుంది. ఈ కరివేపాకును కేవలం సువాసనకు మాత్రమే కాదు కొన్ని రకాల ఔషధ గుణాలను పొందడానికి కూడా ఉపయోగిస్తారు.
కరివేపాకు నిత్యం వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు స్వస్తిచెప్పవచ్చు. కరివేపాకు రుచికి మాత్రమే కాదు ఇందులోని ఆరోగ్య ప్రయోజనాలను మనం తెలుసుకుంటే అనేక విషయాలు భోధ పడతాయి. దీనివల్ల కరివేపాకును వంటకాల్లోనే కాకుండా రకరకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు నివారించడానికి ఉపయోగిస్తున్నారు. ఎండిన కరివేపాకులు, ధనియాలు, జీలకర్రలను నెయ్యిలో వేయించి, మెత్తగా చూర్ణంచేసి సీసాలో నిల్వచేసుకుని మనo చేసే భోజనంలో వాడితే జీర్ణశక్తి పెరుగుతుంది అని అంటారు.
కరివేపాకులను ముద్దగా నూరి 1 నుంచి 2 టీ స్పూన్ల మోతాదులో అరకప్పు మజ్జిగతో కలిపి రోజుకు 2 నుంచి 3 సార్లు తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెపుతూ ఉంటారు. అదేవిధంగా కరివేపాకు కాయల రసం తీసుకుని అంతే మోతాదులో నిమ్మరసం కలిపి తీసుకుంటే చర్మంపై దద్దుర్లు, వాపు సమస్యలు తగ్గుతాయి. కరివేపాకు వేరు రసాన్ని ప్రతిరోజూ రెండు పూటలా టీస్పూన్ మోతాదులో తీసుకుంటే మూత్ర పిండాల సమస్య నుండి బయట పడవచ్చు అని కూడ అంటారు.
కరివేపాకు రసాన్ని పెరుగుతో గాని, వెన్నతోగాని కలిపి కళ్ల కింద చర్మం మీద రాసుకుంటే నల్లటి వలయాలు తగ్గుతాయి. కరివేపాకులో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే మన తెలుగు వారి లోగిళ్ళలో ఇప్పటికీ కరివేపాకు చెట్టు ఎక్కడ చూసినా కనిపిస్తుంది. కేవలం రుచి మరియు సువాసనకు మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ కరివేపాకును క్రమం తప్పకుండా ప్రతిరోజును వాడితే ఆరోగ్యానికి లోటుండదు.