కవులు అందంగా చెప్పిన - మంచి మాటలు

1. “పుస్తకం వనితా విత్తం పరహస్త గతం గతమ్ | 
అద్వాపునః రాయాతి జీర్ణం భ్రష్టాచ ఖండనమ్||

భావము:  పుస్తకాన్ని, స్త్రిమూర్తిని, ధనమును వేరొకరి చేతికి ఇవ్వరాదు. యిచ్చినచో తిరిగిరావు. ఒకవేళ వచ్చిననూ, పుస్తకము చిరిగి పోవచ్చును, ఆడది చెడి పోవచ్చును, ధనము పూర్తిగా రాదు. కొంతవరకే రావచ్చును. కావున ఈ మూడు వస్తువులను ఎవ్వరికిని ఇవ్వరాదు

2. “ప్రాణం వాపి పరిత్యజ్య మానమే వాభిరక్షతు 
అనిత్యో భవతి ప్రాణో మాన ఆ చంద్రతారకం”

భావము: ప్రాణము కంటే మానము గొప్ప. కావున ప్రాణం పోతున్నాసరే మానమునే కాపాడుకోవాలి. ఎందుచేతనంటే ప్రాణము నిత్యమూ కాదు. మానము సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఉంటుంది. ఇది నిత్యమని తెలుసు కొనవలెను.

3. ఆనక అమృతంబు దానిట్టి చవి యని
జనుల కేర్పరుపఁగ జాలు వారు ;
చూడక మన్మధు సుందరాకారంబు
గరిమ చూపగ జాలు కడక వారు;
వినకయ పరత్త్వ విపుల వివాదంబు
వినుతింపఁ జాలెడు వెరవు వారు;
అంటక మెరుపుల యందంబు వ్రేగును
గణుతింపఁ జాలు ప్రఖ్యాతి వారు;
ఆవె: కంపుఁ గొనకయ కల్పవృక్షముల పుష్ప
సౌరభం బిట్టిదని చెప్పఁజాలు వారు
నెందు జూచిన ధాత్రిలో హృదయ దృష్టి
"కవులు కానని మర్మంబుఁ గలదె జగతి?"

భావము: తాము త్రాగకున్నా అమృతం యొక్క రుచిని గూడా చెప్పగల సమర్ధులు. తాము చూడకున్నా మన్మధుని సుందరాకార వైభవాన్ని మనకన్నుల ముందు నిలుపగల్గిన మహనీయులు, తాము వినకున్నా వేదాంత వాదాలను నుతింపగల సమర్ధులు. తాము చేతితో ముట్టకుండగనే మబ్బులలోని మెరపుల అందమును లెక్కపెట్టగల ప్రసిద్ధులు కవులు. 

తాము వాసన జూడకున్నను కల్పవృక్షాల పుష్పాల సువాసన లిట్టివని చెప్పగలిగినవారు. కవులే! ప్రపంచంలో యెక్కడ జూచినా తమ మనోనేత్రాలతో, కవులు చూడరాని రహస్యాలేవీ లోకంలో లేనేలేవు. నిజమే మరి! అందుకే "రవిగాంచనిచో కవిగాంచ నేర్చునే  సూర్యుడు చూడలేని చోటులు దృశ్యాలు కూడా కవి చూడగలడు" అన్నది ప్రచారంలో ఉన్నది.  ఊహా ప్రపంచనేత ! భావనా విఖ్యాత! లోకోత్తరవర్ణనా ప్రణీత - కవిని మించువారు ఈలోకంలో వేరేవ్వరున్నారు?

4. యదాచిత్తం తథావాచ: యథా వాచ: తథా క్రియా:!
చిత్తే వాచి క్రియా యాం చ మహతాం ఏక రూపతా!!

మనస్సులో ఉన్న భావాన్ని చెపుతారు, వారు చెప్పినట్లు చేసి చూపుతారు, అనగా " మనస్సు - మాట - పని" ఈ  మూడింటి యందు సమాన భావమును చూపేదే త్రికరణ శుద్ధి అంటారు. ప్రతిఒక్కరు అదేవిధముగా ఉండుటకు ప్రయత్నించాలి. లోక శ్రేయస్సే ధ్యేయంగా ఉండే  అట్టి వారినే మహాత్ములంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: