జీవిత సత్యాలు: మీరెంత స్పెషలో మీకు తెలుసా..?
ఆనందం.. ఇది ఎందులో ఉంటుంది. ధనంలోనా, విజయంలోనూ, సంతృప్తిలోనా.. ఎవరైనా చెప్పగలరా.. ఆనందం సంగతి ఏమో గానీ.. జీవితంలో మనిషి దుఃఖానికి కారణం ఏంటో.. ఎప్పుడైనా ఆలోచించారా.. చాలా మంది డబ్బులేకపోతే జీవితంలో ఆనందం ఉండదనుకుంటారు.
కొన్నిసార్లు అది నిజమే కావచ్చు. కానీ అన్నిసార్లూ కాదు. ఎందుకంటే డబ్బు ఉన్న అందరూ సంతోషంగా ఏమీ లేరు. కానీ జీవితంలో దుఃఖాన్ని దూరం చేసుకోవాలంటే ఓ సింపుల్ సూత్రం ఉంది. అదేమిటంటే.. మనం మనల్ని ఎవరితోనూ పోల్చుకోకపోవడం.
జీవితంలో ఎప్పుడైతే పోలిక వస్తుందో అప్పుడు కచ్చితంగా దుఃఖం వస్తుంది. వంద కోట్లు ఉన్నవాడు కూడా పోల్చుకోవడం మొదలుపెట్టి వెయ్యి కోట్లు ఉన్నవాడిని చూసి తనకు లేవే అని దుఃఖపడతాడు. ఈ ప్రపంచంలో ఎవరికి వారే స్పెషల్. ఈ ప్రపంచంలో నీలాంటి వాడు ఒక్కడే అది నువ్వే.
అందుకే ఎవరితోనూ పోల్చుకోకు. నీ ప్లస్ పాయింట్లేవో గుర్తించు. నీ బలమేంటో గుర్తించు. దాని ఆధారంగా ప్రణాళిక వేసుకో. విజయం, ఆనందం తప్పకుండా వరిస్తాయి. పోలిక అంటూ మొదలుపెడితే అందుకు అంతం ఉండదు. అది నీ ఆనందాన్ని మింగేస్తుంది. అందుకే మీరెంత స్పెషలో మీరు గుర్తించండి. మీ విజయం అక్కడే మొదలవుతుంది.