లోకోభిన్న‌రుచి: పులిహోర పొడి

Garikapati Rajesh
పులిహోర గురించి మ‌నంద‌రికీ తెలుసు. ఒక‌ప్పుడు పండ‌గ‌ల‌కే ప‌రిమిత‌మైన పులిహోర ప్ర‌తిరోజూ ఆహారంగా మారిపోయింది. ప్రాంతాన్నిబ‌ట్టి వేర్వేరు రుచులతో దీన్ని త‌యారుచేస్తుంటారు. కొంత‌మంది పులిహోర చేసి దాన్ని తిర‌గ‌మోత వేస్తారు. మ‌రికొంద‌రు పెరుగు క‌ల‌పుకొని తీసుకుంటుంటారు. ఇలా లోకోభిన్న రుచి. ఎవ‌రి రుచిని బ‌ట్టి, ఎవ‌రి అవ‌స‌రాన్ని బ‌ట్టి వారికి అనుకూలంగా మారిపోవ‌డ‌మే పులిహోర ప్ర‌త్యేక‌త‌. ఇప్పుడు మ‌నం లేటెస్ట్ గా పులిహోర పొడి గురించి తెలుసుకుందాం.
పులిహోర పొడికి కావలసిన పదార్ధాలు
పచ్చిసెనగపప్పు – 1 కప్పు
మినప్ప‌ప్పు – ½ కప్పు
తెల్ల నువ్వులు – 1 కప్పు
మెంతులు – 2 టేబుల్ స్పూన్స్
ఎండు కొబ్బరి తురుము – 1 కప్పు
బెల్లం – కొద్దిగా
చింతపండు – 50 గ్రాములు
ఎండుమిరపకాయలు – 10
తిరగమోత కు కావలసిన పదార్థాలు
ఆవాలు – 2 టేబుల్ స్పూన్స్
పల్లీలు - 2 టేబుల్ స్పూన్స్
ఇంగువ – కొద్దిగా
పసుపు – కొద్దిగా
కరివేపాకు – 2 రెమ్మలు
రిఫైండ్ ఆయిల్ – సరిపడినంత
పొడి తయారీ విధానం
స్టవ్ ఆన్ చేసి ఒక బాణలి పెట్టి కొంచెం వేడి అవ్వనివ్వాలి. తరువాత మనం తీసుకున్న పదార్ధాల‌న్నీ నూనె వేయకుండా వేగించుకోవాలి. ముందుగా బాణలి లో మినపప్పు వేసి బాగా వేగనివ్వాలి, వేగేటప్పుడు మాడకుండా గరిటె తో తిప్పుతూ ఉండాలి. తరువాత పచ్చిశనగపప్పు వేసి వేగించాలి, ఆ తర్వాత తెల్లనువ్వులు వేసి మాడకుండా వేయించుకోవాలి. తర్వాత ఎండుకొబ్బరి కుడా వేసి వేయించుకోవాలి, కొబ్బరి త్వరగా మాడిపోతుంది కాబట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి, కొబ్బరి వేగడానికి ఎక్కువ స‌మ‌యం పట్టదు. ఇప్పుడు మెంతులు కుడా వేయించుకోవాలి.  చివరగా చింతపండుని కుడా తడి లేకుండా వేయించుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయల్ని వేయించుకోవాలి. ఇవన్నీ త‌క్క‌వ సెగ‌మీద‌ వేయించుకోవాలి. అన్నీ వేగాక ఇవన్నీ ఒక ప్లేట్ లో వేసి బాగా ఆరనివ్వాలి, ఆరాక బెల్లం, రుచికి సరిపడినంత  ఉప్పు వేసుకొని మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే... రుచికరమైన పులిహార పొడి సిద్ధం..
పులిహార తయారీ విధానం
ఇప్పుడు ముందుగా వండి పెట్టుకున్న రైస్ ని ఒక గిన్నెలోకి తీసుకుని ఆ రైస్ లోకి మనం సిద్ధం చేసిన పులిహార పొడిని రైస్ కి తగినంత కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి అందులో కొంచెం నూనె వేసి కాగనివ్వాలి, నూనె కాగాక అందులో రెండు ఎండుమిరపకాయలు, కొద్దిగా పల్లీలు, కొద్దిగా ఆవాలు వేసి వేగనివ్వాలి, తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసి వేయించుకోవాలి, చివర్లో కరివేపాకు వేసి బాణలిని స్టవ్ మీద నుండి దించేయాలి.  ఈ తిరగమోత మిశ్రమాన్ని పులిహార పొడి కలిపిన రైస్ లో వేసి బాగా కలపాలి. అంతే ఎంతో రుచికరమైన పులిహార రెడీ.... మీరు కూడా ఒక‌సారి త‌యారుచేసి చూడండి.. ఆల‌స్య‌మెందుకు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: