కరోనాతో కాదు భయంతో పోరాడండి.. చదివి తీరాల్సిన పోస్ట్..!
కరోనాతో కాదు భయంతో పోరాడండి
@ ashok Vemulapalli
ఒక కరోనా బాధితుడిగా నా అనుభవంతో రాస్తున్న కథనం ఇది.. కరో నా పాజిటివ్ వచ్చినపుడు మన మైండ్ సెట్ ని కంట్రోల్ లో ఉంచగల్గితే రోగం తగ్గినట్టే .. ఒకవిధంగా కరోనా ని ఒక రోగం అనుకోవడమే పెద్ద రోగం.. దాని నుంచి బయటపడాలంటే ముందుగా భయం తో పోరాడాలి.. నాకు ఏదో జరిగిపోతోందన్న ఫీలింగ్ నుంచి బయట పడాలి..నిజానికి చాలామందికి కరోనా వచ్చి పోయిన విషయం కూడా తెలీదు..విపరీతంగా ఊహించేసుకుని లేని రోగాన్ని కొని తెచ్చుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నవాళ్లే ఎక్కువ..నా ఉద్దేశంలో కరోనా ట్రీట్మెంట్ కి ఫిజిషియన్లు , పల్మనాలజిస్టులు లేదా ఇతర స్పెషలిస్ట్ డాక్టర్ల కంటే మంచి మానసిక వైద్యులతో కౌన్సిలింగ్ ఇప్పిస్తే సగం రోగం తగ్గి నట్టే..
విపరీతమైన గొంతునొప్పి, దగ్గుతో నాకు కరోనా వచ్చిందేమో ననుకుని నేను టెస్ట్ చేయించుకున్నా..నిజానికి ఆ గొంతు నొప్పి విషయం నాకు నేనే కొని తెచ్చుకున్నదే..ఎందుకంటే.. నాకు కూలింగ్ వాటర్ అస్సలు పడదు..కొద్దిగా కూలింగ్ తాగినా నాకు గొంతు ఇన్ఫెక్షన్ వెంటనే వచ్చేస్తుంది. దానితోపాటు దగ్గు, జ్వరం కూడా వస్తుంటాయి.. ఇపుడు వచ్చిన గొంతు నొప్పికి కూడా కారణం అదే.. ఎండ వేడితో ఏమీ కాదులే అని కూల్ డ్రింక్ లో ఐస్ క్యూబ్స్ వేసుకుని మరీ తాగాను. దీంతో కాసేపటికే గొంతు నొప్పి, దగ్గు వచ్చేసాయి.. కానీ ఇది కరోనా అనుకుని టెస్ట్ చేయిస్తే పాజిటివ్ వచ్చింది
సరే నాకు గొంతునొప్పిరావడానికి మూల కారణం ఫలానా అని తెలిసి కూడా అది కరోనా అన్న భావనలో ఉండిపోయా.. అక్కడి నుంచి ఊహించుకోవడం ప్రారంభమైంది.. అక్కడి నుంచి భయం ప్రారంభమైంది.. యాంటీ బయాటిక్స్ వాడగానే రెండు రోజులకు గొంతునొప్పి, దగ్గు పూర్తిగా తగ్గిపోయాయి.. ఇక విపరీత మైన తలనొప్పి మొదలైంది..ఇది కరోనా వల్లే వచ్చిందని తెగ ఊహించేసుకున్నాను.. తీరా డాక్టర్ తో మాట్లాడితే ఆయన అది మయిగ్రేయిన్ నొప్పి అని తేల్చి చిన్న టాబ్లెట్ ఇచ్చారు..క్షణాల్లో తలనొప్పి మాయమైంది..నిజానికి నేను చాలా ఏళ్ళ నుంచి మైగ్రేయిన్ బాధితుడిని.. ఆ సంగతి నాకు గుర్తుకు రాలేదు.. తలనొప్పి అంతా కరోనా వల్లే వచ్చిందని ఊహించుకున్నాను..
ఇక అందరూ ఫోన్ చేసి నీకు నాలుక టేస్ట్ తగ్గిపోయిందా.. ముక్కు వాసన పోయిందా.. అని అడుగుతుంటే నిజంగా నే నాకు అన్నీ పోయాయని ఊహించేసుకున్నాను.. పరిస్తితులు అలా ఊహించుకునేలా చేస్తాయి..నిజంగానే రుచి పూర్తిగా పోయినట్టు, వాసన తెలీనట్టు అనిపించింది..కానీ ఇదంతా హెలూజనేషన్ మాత్రమే..నిజానికి ఇవేమీ నాకు పోలేదు..కేవలం ఫీలింగ్ మాత్రమే.. రియలైజ్ అయ్యి మైండ్ ని కంట్రోల్ కి తెచ్చుకున్నాక రుచి, వాసన అన్నీ నార్మల్ గానే ఉన్నట్టు అనిపించాయి.. విపరీతమైన నీరసం ఉంటుందని అందరూ చెబుతుంటే నేను కూడా కరోనా పేషంట్ గా దాన్ని ఊహించుకుని ఎక్కువగా నీరసపడిపోవడం తప్ప నిజానికి నాకు నీరసం అన్నదే లేదు.. ఊహతో భయంతో వచ్చిన నీరసం ఉత్సాహాన్ని చంపేసింది.
కరోనా వచ్చాక ఒంటరి తనం వల్ల ఆలోచనల పరిధి విస్తృతమవుతుంది.. నెగెటివ్ ఆలోచనలు డామినేట్ చేస్తాయి.. నీ ఒరిజినాలిటీని కరోనా అనే భయం నాశనం చేసి నకిలీని ప్రవేశ పెడుతుంది.. అందుకే ప్రపంచంలో మరెవరికీ రాని జబ్బు నాకు మాత్రమే వచ్చిందని ఊహించేసుకుంటాము.. కానీ ఇదంతా భయంతో వచ్చిన ఊహ మాత్రమే..
కరోనా వచ్చాక జనాల సలహాలు ఎక్కువయిపోతాయి..ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలని చెబితే విపరీతంగా తినడానికి ప్రయత్నిస్తాము.. కానీ రెగ్యులర్ గా ఎంత తినగలుగుతావో అంతే తింటాము కానీ ఎక్కువ ఫుడ్ తినబుద్దికాదు.. విపరీతమైన జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాము..కానీ ఏవీ సరిగా చేయలేము.. పడుకుని లేచాక శరీరంలో ఏదో మూల చిన్న నొప్పి వస్తే.. అది కరోనా వల్లే వచ్చిందని అనుకుంటాము.. కిడ్నీ పోయిందనో..లివర్ పాడైందనో లంగ్స్ లో ఇన్ఫెక్షన్ పెరిగిపోయిందనో.. ఇష్టమొచ్చినట్టు ఊహించేసుకుంటాము..నిజానికి లివర్, కిడ్నీలు శరీరంలో ఎక్కడ ఉంటాయో కూడా తెలీని వాళ్ళు అవి పాడైపోయాయని ఊహించేసుకుంటారు.. ఇదంతా కరోనా భయం వల్ల జరిగే పరిణామం మాత్రమే..
ఈ భయం అనేది మన మెదడుని క్యాప్చర్ చేసేస్తుంది.. నెగెటివ్ ఆలోచనలు. .. పూర్తిగా అక్రమించేసి ఉంటాయి.. భయం అనే బాహుబంధనాల నుంచి బయట పడగలిగితే కరోనా ని తేలికగా తరిమికొట్టొచ్చు.. అందుకే మనం పోరాడాల్సింది కరోనా తో కాదు భయంతో.. కరోనా అంత భయంకరమైంది అయితే ఈ పాటికి ప్రపంచంలో సగం మంది ప్రాణాలు కోల్పోవాలి.. కాబట్టి కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోండి తప్పులేదు.. కానీ అతి జాగ్రత్తలు వద్దు.. అలాగే కరోనా వచ్చాక అతిగా ఊహించుకుని లేని రోగాన్ని తెచ్చుకోకండి.. నిజానికి నేను టెస్ట్ చేయించుకోకుండా ఉండి ఉంటే అసలు నాకు కరోనా ఆవహించిదన్న విషయం తెలిసి ఉండేది కాదు. ఎందుకంటే నేను ఉద్యోగంలో భాగంగా తిరిగిన తిరుగుళ్లకి నాకు ఈపాటికి వందసార్లు కరోనా వచ్చి పోయి ఉంటుంది .
@అశోక్ వేములపల్లి