సండే మార్నింగ్ : టు బి గుడ్ టు డు గుడ్
డబ్బుల్లేక నిరాశలున్నాయి
డబ్బులుండీ నిరాశలున్నాయి
కరోనా తీసుకువచ్చిన మేఘాలివి
అని రాయాలి..
పాపం ఎందరిని బలి తీసుకున్నా
మనిషి ఇంకా తట్టుకుంటూనే ఉన్నాడు
ఈ ఆదివారం మార్కెట్లు కాస్త కళగా ఉన్నాయి
అలా ఉండడాన్ని నేను గమనించాను ప్రేమించాను
ఇదిగో ఈ వీకెండ్ మార్నింగ్స్ ఎలా ఉన్నాయి
అన్న ఆరా.. నిన్న మీరాబాయి చాను నింపిన ఉత్సాహంలా ఉంది .. డబ్బులుంటే ఏం చేస్తారు సర్ అని అడిగిన ఓ ప్రశ్నలా ఉంది.. డబ్బులుంటే కాదు విజయముంటే ఏం చేస్తారు అన్నది కదా కీలకం..ఈమె లానే హిమదాసు అనే అథ్లెట్ ఉన్నారు.. ఆమెది కూడా దేశం గర్వించే స్థాయినే! ఆమె తనకు వచ్చిన డబ్బులను పంచేశారు.. మరి చాను తన ఊరికి ఏమయినా చేస్తారా.. కరోనా వేళల్లో డబ్బులు పంచి హిమదాసు ఎంతో ఆదర్శం అయ్యారు.. మీరూ అలానే చేయండి మీరా చాను.. డబ్బులుంటే పంచేయ్యడం నేర్చుకోండి.. అలా లేనప్పుడు మీకు వచ్చిన డబ్బుకూ కీర్తికీ మధ్య వైరం మొదలవుతుంది. ఆ తగాదాలో మీరు ఓడిపోతారు.
కలలున్నాయి అని
కలలే జీవితాదర్శంకు
సరిపోతాయని అనుకోను నేను
ఐదేళ్ల కల.. నిన్నటి ఒలంపిక్స్ లో తీరిందన్న ఆనందంలో మీరాబాయి చాను.. రియో లో సరయిన పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయా అన్న బాధ నుంచి లేదా అంతకుముందని అవమానాల నుంచి ఆమె కోలుకున్నారు. ఎవ్వరయినా కోలుకోవాల్సింది కోరుకోవాల్సింది ఇదే.. కోటి రూపాయలు ప్రకటించి మీ కోసం ఓ ఉద్యోగం రిజర్వు చేసి ఉంచాను అని చెప్పారు మణిపూర్ సీఎం..ఈశాన్య రాష్ట్రాల సీఎంల సమావేశంలో అందిన వార్తతో అంతా లేచి చప్పట్లు కొట్టారు.. మిమ్మల్ని చూసి ఈ దేశం గర్విస్తుంది..అని ఆ ప్రధాని చెప్పినప్పుడో.. అమిత్ షా సైతం ఆనందంతో చప్పట్లు కొట్టినప్పుడో ఇంకాస్త ఆనందం జత చేరింది ఈ దేశపు పౌరుల్లో...
చాలా మందికి దక్కని కలలు ఉంటాయి.. అమ్మానాన్నలు వాటికి ప్రాణం పోస్తారు.. ఇవాళ తల్లిదండ్రుల దినోత్సవం. ఎవరో అన్నట్లు ప్రేమను పంచిన అమ్మ దగ్గర బాధ్యత పంచిన నాన్న దగ్గర మనం అంతా ఓడిపోవాలి.. వారికి మోకరిల్లి నా విజయంనా ఆనందం మీవే అని చెప్పిరావాలి.. మీరాబాయి చాను మీరు కూడా ఇదే చేయాలి.. మిమ్మల్ని చూస్తే చాలా చాలా స్ఫూర్తి ఇవాళ ఈ దేశానికి.. ఇదెంత పనిచేస్తుందో తెలియదు కానీ పనిచేసినంత కాలం కరోనా కొట్టిన దెబ్బల నుంచి వేగంగా జయించవచ్చు అన్న సంకల్పం ప్రతి ఒక్కరిలో వస్తుంది. గాయాలు మంచే చేస్తాయి అన్న నమ్మకం ఈ దేశ పౌరులలో కలిగించవచ్చు.. కూరగాయలు అమ్ముకున్న టీచర్ .. పస్తులుండి చదివిన ఓ స్టూడెంట్.. పనుల్లేక గడిపిన లేబర్ ఇలా అంతా మీ నుంచి నేర్చుకోవాలి.. మీరే మళ్లీ మళ్లీ కొత్త ఉత్సాహం ఒకటి నింపాలి.. నేనూ నా దేశం ఇంతటి గర్వాన్ని నెత్తిన పెట్టుకుని ప్రయాణించేందుకు మీరు కదా కారణం.. మేం మీకు మీ నేల తల్లికి వందనాలు చెల్లిస్తున్నాం.. భారత్ మాతాకి జై అని రాశారు..ఒకరు.. మిమ్మల్ని కీర్తిస్తూ చివర్లో.. అదే మాట అదే స్ఫూర్తి అదే రంగుల పతాక మాలో నాలో ఇంకొందరిలో భారత్ మాతాకి జై..