ప్రకృతి - వికృతి : సుదీర్ఘ వేసవికి సంకేతమా?
ప్రకృతి గానమూ లేదు
సముద్ర ఉపరితల జలాలు
వేడెక్కిపోతున్నాయి
భూమి వేడెక్కిపోతోంది
నేలకూ నింగికీ మధ్య
ఉన్న బంధమేదో తెగిపోతోంది
ఓ విధంగా ఉత్పాతం
ఓ విధంగా విలయానికి సంకేతం
అదిగో సుదీర్ఘ వేసవి సమీపాన అని హెచ్చరికలు ఇస్తోంది
ఐక్య రాజ్య సమితి అంతర ప్రభుత్వ కమిటీ (ఐపీసీసీ)
తీవ్ర తుఫానులు.. ఆశించిన స్థాయిలో వానలు లేకపోవడం రెండూ దుర్భిక్షాలకు కారణాలు.. భూ వాతావరణం వేడెక్కడం.. లేదా పెద్ద ఎత్తున వరదలు వచ్చి, ఉప్పెనలు వచ్చి నేల సారాన్ని లాక్కుపోవడం ఇవన్నీ మన దరిద్ర దినాలకు సంకేతాలు..అయినా అడవిని కోల్పోయి, నదిని కోల్పోయి మనం మాత్రం నిశ్చింతగా ఉండడం ఎలా సాధ్యం. ఇప్పటికే యురేనియం తవ్వకాలు, ఇసుక లో విలువయిన ధాతువుల ఏరివేతలు ఇలా ఎన్నో! వీటిని కట్టడి చేయలేని ప్రభుత్వం భూతాపాన్నీ సంబంధిత నష్టాలనూ ఎలా నివారిస్తుంది. కేవలం ఇవన్నీ రాసుకునేందుకు చెప్పుకునేందుకే పరిమితం అయితే ఐక్యరాజ్య సమితి చెప్పే మాటలు అన్నీ త్వరలో నిజం అయిన వేళ అంతా ప్రమాదాలను చూస్తూ ఉండిపోవాల్సిందే!
ఇంటికో మొక్కను పెంచాలి..హరిత హారం..హరిత వనం..లేదా పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు..ఈ విధంగా పథకం ఏదయినా నినా దం ఏదయినా ప్రమాదం నుంచి బయటపడాలి. అదిగో మరికొన్నేళ్లలో మనం ఊహించని పరి ణామాలు..విలయాలు జరిగేందుకు ఆస్కారం ఉంది. భారత్ చేపట్టాల్సిన కట్టడి చర్యలు చేపట్టకుంటే రానున్న కాలంలో భారీ నష్టాలను చవి చూడడం తప్పదు. భూతాపం పెరిగిపోతున్న కొద్దీ ప్రమాద తీవ్రతల స్థాయి హెచ్చ రిల్లడం ఖాయం.కానీ ఇవేవీ పట్టని విధంగా ప్రజలూ, పాలకులూ ఉన్నారు. ఇప్పటికే సముద్ర జలాలను కాలుష్యం నుంచి కాపాడలేకపోతున్నాం. నదులను రక్షించుకోలేకపోతున్నాం.కొండలన్నీ తవ్వి పోసి ఎక్కడెక్క డికో త రలించి ఎవ్వరెవ్వరి నుంచో డబ్బులు గుంజుకుంటున్నాం. ప్రకృతి కాపాడేది ఆదివాసీలే అని ప్రగల్బాలు చెప్పే నాయకులు వారి కోసం ఏమీ చేయలేని దుఃస్థితిలో ఉన్నారు. నేలకు ఇంతటి క్షోభను ఇచ్చి మనం బతుకమ్మ పండుగలకో, లేదా బోనాల జాతరలకో లేదా అమ్మవారి పాదాల చల్లదనోత్సవాలకో ప్రాధాన్యం ఇవ్వడం కన్నా చుట్టూ ఉన్న పరిసరాల్లో పచ్చందనాల ప్రాధాన్యం పెంచడం అత్యావశ్యకం.
లేదంటారా చూస్తూ ఉండండి మీరు ప్రళయాలను చూస్తారు.మీరు ఉత్సాతాలను అనుభవిస్తారు..లేదా అనూహ్య స్థితిలో జీవావరణం మృత్యువాత పడడం గమనిస్తారు.. ఇంతటి నాన్ ఎకో బ్యాలెన్స్ గతంలో ఎన్నడూ లేదని, భారత్ అత్యంత ప్రమాదకర స్థితిలో ఉందని ఐపీసీసీ చెబుతోంది.అయినప్పటికీ మనలో మార్పులేదు. ముఖ్యంగా సముద్ర జలాలు సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా వేడెక్కుతున్నాయి అని, సుదీర్ఘ వేసవి అనే కాదు సుదీర్ఘ వర్షాకాలం కూడా ఇకపై ఉండనుందని హెచ్చరిస్తోంది. కాళ్ల కిందకు ప్రమాదం రాకమునుపే కళ్ల ముందరి ప్రకృతికి అండగా ఉండడం అన్నది ఇవాళ అంతా చేయాల్సిన పని. విహిత కర్తవ్యం కూడా! కానీ ఆ దిశగా ప్రభుత్వాలు ఉన్నాయా? లేవా?