తెలుసా: ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒకప్పుడు కమెడియన్?
అంతే కాదు.. ఆయన గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఓ వేషం కూడా వేశాడు.. ఆతర్వాత ఆ వేషమే నిజమైంది.. వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఆగ్నేయ ఉక్రెయిన్‌లో రష్యా మాట్లాడే ప్రాంతంలో పుట్టాడు. హాస్యనటుడిగా కేరీర్ ప్రారంభించి తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. ఏకంగా అధ్యక్ష పదవినే అందుకున్నాడు. 1978 జనవరి 25న పుట్టిన వొలొదిమిర్ జెలెన్‌స్కీ కీవ్ జాతీయ అర్థశాస్త్ర విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ పుచ్చుకున్నాడు. తర్వాత క్వర్తల్95 అనే సంస్థను నెలకొల్పి సినిమాలు, కార్టూన్లు, టీవీ షోలను నిర్మించాడు. ‘సర్వెంట్ ఆఫ్ ద పీపుల్’ అనే టీవీ షోలో ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడిగా నటించాడు కూడా. ఆ తర్వాత 2018 మార్చిలో క్వర్తల్95 ఉద్యోగులతో కలసి రాజకీయ పార్టీ పెట్టాడు.
అదే ఏడాది డిసెంబరు 31 సాయంత్రం తాను అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్టు ఎనౌన్స్ చేశాడు. అప్పటికే మంచి పాపులారిటీ సంపాదించుకున్న వొలొదిమిర్ జెలెన్‌స్కీ.. అనేక సర్వేలలోనూ అప్పటికే ముందున్నాడు. ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపు రెండో రౌండుకే 73.2% ఓట్లు సంపాదించుకున్నాడు. తిరుగులేని మెజారిటీతో అధ్యక్షుడు అయ్యాడు. అయితే.. వొలొదిమిర్ జెలెన్‌స్కీ చేతిలో ఓడిపోయిన వ్యక్తి రష్యా అనుకూలుడు కావడం విశేషం.
అంటే వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు కావడం ద్వారా పుతిన్‌కు ఆరంభంలోనే నచ్చని వ్యక్తిగా మారాడు. ఆ తర్వాత ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం తీసుకురావాలని వొలొదిమిర్ జెలెన్‌స్కీ చేసిన ప్రయత్నాలు పుతిన్‌కు కోపం తెప్పించాయి. చివరకు అదే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దారి తీసింది.