థాట్ వెర్సస్ డే : సైన్స్ డే అంటే?
సంబంధిత ప్రశ్నకు ఆనవాలు వేరు
వెతికితే జవాబు అన్నది ఒక రూపంలో
కాదు ఒక రూపం నుంచి మరో రూపం వరకూ
మారేది ప్రశ్న మారుతున్నది జవాబు
కాలం కూడా! ఆ పాటి పరిణితి తీసుకుంటే
ఇప్పటి సైన్స్ డే కు ఓ విలువ మరియు అర్థం కూడా!
శరీరాన్నీ అర్థం చేసుకోవాలి.మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.బుద్ధి కుశలతను పెంపొందించుకోవాలి.జ్ఞానాన్ని అంచనా వేసుకోవాలి.ఆత్మ జ్ఞాన రీతులను అర్థం చేసుకోవాలి. ప్రయోగ సంబంధ ఫలితాల్లో ప్రయోజన రీతులను అంచనావేయాలి. అప్పుడు మాత్రమే యుద్ధం కన్నా శాంతి గొప్పది.అప్పుడు మాత్రమే శాంతి స్థాపన ఆవశ్యకత అన్నది చెప్పే మాటల్లో కన్నా ఆచరణకు తూగేది.ఇవన్నీ సైన్సు నేర్పదు. జీవితం నేర్పిస్తుంది.ఇంకా చెప్పాలంటే వెలుగు చీకట్లు రెండూ నేర్పుతాయి కానీ మనం నేర్చుకోక ఉండిపోతున్నాం. ఇవాళ సైన్స్ డే కనుక ప్రతి దేశం శాంతి కోసం యుద్ధం అంటూ బీరాలు పలకక కనీస స్పృహతో పౌర సమాజాన్ని కాపాడాలన్న కనీస స్పృహతో ప్రవర్తిస్తే మేలు.మంచి సమాజం నిర్మాణం అన్నది సులువు. సాధ్యం కూడా!
రామన్ ఎఫెక్ట్ ను గుర్తించిన సర్ సీవీ రామన్ కాంతి సంబంధిత శాస్త్రంలో చేసిన ప్రయోగాలకు అనుగుణంగా ఎన్నో మార్పులు వచ్చాయి.వాటికి గుర్తింపుగా ఇవాళ ఏటా మాదిరిగానే సైన్స్ డే నిర్వహించుకుంటున్నాం.నోబెల్ బహుమతి అందుకున్న సర్ సీవీ రామన్ ఓ విధంగా వైజ్ఞానిక రంగాన్ని,అదేవిధంగా శాస్త్ర సాంకేతిక పురోగమానాన్నీ పూర్తిగా మార్చేశారు అని చెప్పవచ్చు. ఆ విధంగా ఇవాళ మనకు అంటే ఈ ఫిబ్రవరి 28 మనకు సైన్స్ డే.
ఇక మన ప్రభుత్వాలు శాస్త్ర సాంకేతిక రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం కానీ వాటిని వాడుకుంటున్న విధానం కానీ ఓ సారి చర్చించాలి. ఇప్పుడు అంతా ఉక్రెయిన్ పరిణామాలతో ఊగిపోతున్నారు కనుక రేపో మాపో అణుదాడులు కూడా చేస్తామని రష్యా అంటోంది కనుక వాటి గురించి కూడా ఓ సారి ఆలోచిద్దాం.ఇంతకూ సైన్స్ అణ్వస్త్రాల తయారీకి మరియు ఉపయోగానికే పరిమితం అయి ఉందా లేదా ఆ పరిధి దాటి మానవ మనుగడకు ఏమయినా సహకారం అందిస్తుందా? ఏటా జరిగే శాస్త్ర,సాంకేతిక రంగాలకు చెందిన పండుగలన్నీ ఈ కోవలోనివేనా!