ఆడవాళ్ళ షాపింగ్ మగాళ్లకు ఎందుకు ఇష్టం ఉండదు.. అధ్యయనంలో ఏం తేలిందంటే?
సాధారణంగా ఆడవాళ్లు ఎక్కువసేపు షాపింగ్ చేస్తుంటారు. వీరిపై చాలా జోక్స్, మీమ్స్ కూడా వస్తుంటాయి. వారితో షాపింగ్ కి వెళ్తే ఇక స్నానాలు, భోజనాలు షాప్స్ లోనే చేయాల్సి వస్తుందని సరదాగా అంటుంటారు. నిజానికి ఆడవాళ్ళతో షాపింగ్ వెళితే అలాంటి పరిస్థితి వాస్తవంగానే ఫేస్ చేయాల్సి వస్తుంది. తాజాగా క్విడ్‌కో అనే ఒక యూకే బేస్డ్ కంపెనీ చేసిన అధ్యయనం ప్రకారం, మగవాళ్లు తమ భార్యలు లేదా స్నేహితురాళ్లతో కలిసి షాపింగ్‌కు వెళ్లినప్పుడు 26 నిమిషాలకు మించి ఆసక్తి చూపించరు. అంటే, వారు చాలా త్వరగా విసుగు చెందుతారు. కానీ స్త్రీలు మాత్రం గంటల తరబడి షాపింగ్ చేయడంలో ఆనందిస్తారు. ఈ తేడా వల్ల జంటల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతాయి.
ఈ అధ్యయనం ప్రకారం, నలుగురిలో ఒక మగ వ్యక్తి తమ భార్యలు లేదా స్నేహితులతో షాపింగ్‌కు వెళ్లినప్పుడు సగం దారిలోనే విసుగు చెంది వెళ్లిపోతున్నారట. దీనికి కారణం, రద్దీగా ఉన్న దుకాణాలు, ఆకలి, వారికి ఇష్టమైన క్రీడలు లేదా ఇతర కార్యకలాపాలను మిస్ అవుతున్నట్లు భావించడం. పురుషులు త్వరగా షాపింగ్ ముగించాలని కోరుకుంటారు. కానీ స్త్రీలు మాత్రం వివిధ వస్తువులను చూసి, పోల్చి చూసి షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు.
ఈ అధ్యయనం ప్రకారం, సర్వేలో పాల్గొన్న సగం మంది పురుషులు షాపింగ్ కారణంగా తమ భాగస్వామితో గొడవ పడ్డామని అంగీకరించారు. పురుషులు విసుగు చెందినప్పుడు, అసహనం వస్తుంది. షాపింగ్ ఎక్కువ సేపు సాగితే ఈ అసహనం పెరుగుతుంది. చాలా సార్లు మగవాళ్ళు దుకాణాల వెలుపల కూర్చుని ఫోన్ చూస్తుంటారు లేదా విశ్రమించడానికి చోటు వెతుకుంటారు, అయితే వారి భాగస్వామి మాత్రం షాపింగ్ కొనసాగిస్తారు.
జంటలు కలిసి షాపింగ్ చేయడం వల్ల చాలా సందర్భాలలో గొడవలు జరుగుతాయి. అయితే, ఈ సమస్యను తీర్చడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు, కలిసి షాపింగ్‌కు వెళ్ళేటప్పుడు తక్కువ సమయం కేటాయించుకోవడం లేదా రద్దీ తక్కువగా ఉండే సమయంలో వెళ్ళడం వల్ల గొడవలు తగ్గుతాయి. షాపింగ్ తర్వాత తమకు ఇష్టమైన క్రీడలు చూడడం లేదా ఆహారం తీసుకోవడం వంటి కార్యకలాపాలకు సమయం కేటాయించుకోవడం వల్ల పురుషులు మరింత ఆనందంగా ఉంటారు. షాపింగ్ చేస్తున్నప్పుడు కాఫీ తాగడం లేదా తినడం వంటివి చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. షాపింగ్ కొంతమందికి ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఇద్దరు వ్యక్తులు షాపింగ్ గురించి ఒకే అభిప్రాయం కలిగి ఉండకపోతే గొడవలు జరగవచ్చు. షాపింగ్ విషయంలో వారికి ఉన్న తేడాలను అర్థం చేసుకోవడం వల్ల జంటలు అనవసరమైన గొడవలను నివారించుకోవచ్చు.