నిద్రలో మీద ఎవరో కూర్చున్నట్లు అనిపిస్తోందా.. కారణం ఏంటంటే?
స్లీప్ పెరాలసిస్ సమయంలో, మనం శరీరంలో మనమే బంది అయిపోయినట్లు అనిపిస్తుంది. మనసు మేల్కొని ఉంటుంది కానీ శరీరం స్తంభించిపోయినట్లు ఉంటుంది. నిద్ర సమయంలో మెదడు, శరీరం సింక్ లో లేనప్పుడు ఇది జరుగుతుంది. ఇది సాధారణంగా మీరు నిద్రలోకి జారుతున్నప్పుడు లేదా మేల్కొంటున్నప్పుడు సంభవిస్తుంది. స్లీప్ పెరాలసిస్ ఎందుకు జరుగుతుందనే దానికి ఖచ్చితమైన కారణం తెలియదు. కానీ, ఇది నిద్ర-సంబంధిత రుగ్మతలు, ఒత్తిడి, నిద్ర లేమి వంటి కారణాల వల్ల సంభవించవచ్చు. ఈ అనుభూతి ఎదురైనప్పుడు చాలామంది భయపడతారు. ఆందోళనకు గురవుతారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రేతాలు, దెయ్యాలు వంటివి కనిపించినట్లు అనిపిస్తుంది.
ఇది సాధారణంగా తీవ్రమైన సమస్య కాదు. స్లీప్ పెరాలసిస్ వల్ల ఎలాంటి శారీరక నష్టం జరగదు. కానీ, భయంకరమైన అనుభవం కావచ్చు. దీన్నుంచి బయటపడడానికి కొన్ని సాధారణ మార్గాలు ఉన్నాయి. నిద్ర అలవాట్లను మార్చుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, నిద్ర మందులను తీసుకోవడం (డాక్టర్ సలహా మేరకు) వంటివి చేయవచ్చు. అధ్యయనాల ప్రకారం, ప్రతి 10 మందిలో 3 మందికి జీవితంలో ఒక్కసారైనా ఈ అనుభవం కలుగుతుంది. ముఖ్యంగా టీనేజర్స్, ఇరవైలలో ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్లు కూడా ఒత్తిడి తగ్గించుకుంటే ఈ అనుభూతుల నుంచి బయటపడవచ్చు.
గాఢ నిద్రలో ఉన్నప్పుడు, మన శరీరం మన కలలను వాస్తవంగా మార్చకుండా నిరోధించడానికి కండరాలను తాత్కాలికంగా స్తంభింపజేస్తుంది. ఇది నేచురల్ గా జరిగేది. ఈ అనుభూతి కలిగినంత మాత్రాన ఏదో అనారోగ్యం ఉందని అనుకోవాల్సిన అవసరం లేదు. మీక్కూడా ఇలాంటి అనుభూతులు కలిగాయా?