చేతబడి చేస్తున్నారనే అనుమానం.. 110 మందిని నరికేసారు?
మూఢనమ్మకాలకు ఏ దేశము అతీతం కాదని తాజా దారుణ సంఘటన ఒకటి రుజువు చేస్తోంది. ఈ క్రమంలో ఎంతోమంది అమాయకులు బలికావడం మాత్రం దురదృష్టకరం. అవును, కరేబియన్ దేశం అయినటువంటి "హైతీ"లో చోటుచేసుకున్న హింస ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. దీనికి కారణం చేతబడి అనే అనుమానమే. ఆ అనుమానమే సైట్ సోలైల్ మురికివాడ పై యమపాశం అయ్యింది. స్థానిక గ్యాంగ్ ఒకటి ఆ మురికివాడపై పడి మారణహోమం సృష్టించింది. దొరికిన వారిని దొరికినట్టు అతి కిరాతకంగా చంపేసింది.
దీనికి ముఖ్యకారణం... తమ గ్యాంగ్ లీడర్ కుమారుడికి చేతబడి చేశారనే అనుమానంతోనే ఆ ముఠా సభ్యులు ఈ ఘాతూకానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని నేషనల్ హ్యూమాన్ రైట్ డిఫెన్స్ నెట్‌వర్క్ వెల్లడించగా సంచలనంగా మారింది. విషయం ఏమిటంటే... స్థానికంగా ఉన్న "వివ్ అన్సన్మ్ గ్యాంగ్"కు "మోనెల్ మికానో ఫెలిక్స్" అనే వ్యక్తి నాయకుడిగా ఉన్నాడు. ఇటీవల అతడి కుమారుడు అనారోగ్యం పాలయ్యాడు. ఈ క్రమంలో అతడు ఓ పూజారిని కలవగా... ఆ ప్రాంతంలోని వృద్దులు చేతబడి చేసి చిన్నారికి హాని కలిగిస్తున్నారనే అనుమానాన్ని అతని మెదడులో నాటాడు.
కట్ చేస్తే ఫెలిక్స్ జంతువులా మారాడు. ఆగ్రహంతో కేకలు వేస్తూ తన కొడుకుకి హాని చేస్తున్నవారిని చంపేయమని తన ముఠాని ఆదేశించాడు. దీంతో మురికివాడలో ఉన్న 60 ఏళ్లు పైబడిన వృద్దుల పై అతడి ముఠా సభ్యులు అత్యంత పాశవికంగా దాడులకు తెగబడ్డారు. శుక్ర, శని వారాల్లో వరుసగా 2 రోజుల పాటు వేట కొడవళ్లు, కత్తులతో నరికి చంపారు. ఈ ఘటనలో సుమారుగా 110 మంది ప్రాణాలు కోల్పోయారని హ్యూమన్ రైట్ డిఫెన్స్ నెట్ వర్క్ తాజా ప్రకటనలో తెలిపింది. "సైట్ సోలైట్" అనేది హైతీ రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్ లోని అత్యంత రద్దీగా ఉండే మురికివాడ ప్రాంతం. ఇక్కడ గ్యాంగ్ ల నియంత్రణ అత్యంత దారుణంగా ఉంటుంది. కనీసం ఫోన్లు వినియోగించే పరిస్థితి కూడా ఇక్కడ ఉండదు. దీంతో ఈ మారణహోమం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది.