ఏంటి.. స్నానం చేయకపోతే ఆయుష్షు పెరుగుతుందా?
అసలు విషయం ఏమిటంటే? చలికాలంలో కొంతమంది రోజూ స్నానం అనేది విధిగా చేయడం మానేస్తారు. రోజు తప్ప రోజు లేదా రెండు మూడు రోజులకోసారి స్నానం చేస్తుంటారు. మరోవైపు ఈ కాలంలో స్నానం చేయకపోతేనే చాలా మంచిది... ఆయుష్షు పెరుగుతుందని చెబుతూ ఉంటారు. ఈ కారణంగా కూడా కొంతమంది అస్సలకే స్నానం చేయరు. కానీ ఎండాకాలమైనా, చలికాలమైనా రోజూ స్నానం చేయాలని డాక్టర్లు, సూచిస్తున్నారు. పరిశుభ్రంగా ఉండాలంటే చలికాలంలో కూడా ప్రతిరోజూ స్నానం చేయాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో ఎండాకాలంలో లాగా చెమట ఎక్కువగా పట్టకపోవచ్చు. కానీ మీ శరీరం మాత్రం ప్రతిరోజూ నూనెలను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. అలాగే చనిపోయిన చర్మ కణాలు, బ్యాక్టీరియా శరీరంపై పేరుకుపోతాయి కాబట్టి మీరు రోజూ స్నానం చేయకపోతే గనుక ఇవి మీ ఒంటికి అంటుకూనే ఉండి ఎన్నో సమస్యల బారిన పడేలా చేస్తాయి అని అంటున్నారు.
చలికాలంలో రోజూ స్నానం చేయడం వల్ల శరీర దుర్వాసన, చర్మ ఇన్ఫెక్షన్లు, ఇతర పరిశుభ్రత సంబంధిత సమస్యల ప్రమాదం నుండి దూరంగా ఉండవచ్చు. నిపుణుల ప్రకారం.. రోజూ స్నానం చేయకపోతే మీ ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గిపోతుంది. లేనిపోని సీజనల్ రోగాలు, ఇతర వ్యాధుల బారిన పడతారు. కాబట్టి ఏ కాలంలో అయినా స్నానం చేయడమే ఉత్తమం అని చెబుతున్నారు. అయితే ఈ కాలంలో గోరువెచ్చని నీళ్లు స్నానం చేయడం ద్వారా శరీరంలో రక్త ప్రసరణను పెంపొందించుకోవచ్చని అంటున్నారు. దీనివల్ల రోగనిరోధక కణాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. మెరుగైన రక్త ప్రసరణ జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సాధారణ చలికాల అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. కాబట్టి ఈ కాలంలో స్నానాన్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేయద్దు మరి!