ఇడ్లీలు ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలివే.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
సాధారణంగా దక్షిణ భారతీయులందరికీ ఇడ్లీ అత్యంత ఇష్టమైన అల్పాహారం. సులభంగా జీర్ణమవుతుందని, నూనె ఉండదని చాలామంది దీనిని ఆరోగ్యకరమైన ఆహారంగా భావిస్తారు. అయితే ఏ ఆహారమైనా అతిగా తీసుకుంటే అది శరీరానికి హాని చేస్తుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇడ్లీలను మోతాదుకు మించి తినడం వల్ల కలిగే అనర్థాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేయవచ్చు.
ఇడ్లీ తయారీలో ఉపయోగించే ప్రధాన పదార్థం పాలిష్ చేసిన బియ్యం. దీనివల్ల ఇడ్లీలలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి, కానీ పీచు పదార్థం (ఫైబర్) చాలా తక్కువగా ఉంటుంది. తెల్ల బియ్యంతో చేసిన ఇడ్లీలను ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. దీనివల్ల మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారికి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే, ఇడ్లీలలో గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది.
చాలామంది ఇడ్లీని బరువు తగ్గడానికి మంచి ఆహారంగా భావిస్తారు, కానీ అది పూర్తిగా నిజం కాదు. పిండి పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల వీటిని అధికంగా తీసుకుంటే శరీరంలో క్యాలరీలు పెరిగి, బరువు తగ్గడానికి బదులు ఊబకాయం పెరిగే ప్రమాదం ఉంది. ఇడ్లీ పిండిని ఎక్కువ సమయం పులియబెట్టడం వల్ల కొందరిలో గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా బయట దొరికే ఇడ్లీ పిండిలో రుచి కోసం సోడా ఉప్పును అధికంగా కలుపుతుంటారు, ఇది రక్తపోటు (బిపి) సమస్య ఉన్నవారికి ఏమాత్రం మంచిది కాదు.
ఇక ఇడ్లీతో పాటు తీసుకునే చట్నీలు కూడా మరో సమస్యకు కారణమవుతాయి. పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీలలో క్యాలరీలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇడ్లీలను తింటున్నప్పుడు మనకు తెలియకుండానే ఎక్కువ మొత్తంలో చట్నీని తీసుకుంటాం, ఇది గుండె ఆరోగ్యానికి అంత క్షేమకరం కాదు. కాబట్టి ఇడ్లీలను ఆరోగ్యకరంగా మార్చుకోవాలంటే తెల్ల బియ్యానికి బదులు రాగులు, జొన్నలు లేదా ఓట్స్ వంటి తృణధాన్యాలను కలిపి తయారు చేసుకోవడం మంచిది. అలాగే ఇడ్లీల సంఖ్యను తగ్గించి, పీచు పదార్థం అధికంగా ఉండే కూరగాయల సాంబార్‌తో తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యకరమైన ఆహారమైనప్పటికీ, దాన్ని తీసుకునే విధానం మరియు మోతాదు అనారోగ్యానికి దారితీస్తుందని మర్చిపోకూడదు.