ఫ్రిజ్ లో పెట్టిన కొత్తిమీర తాజాగా ఉండాలా.. ఈ చిట్కాలను కచ్చితంగా పాటించాల్సిందే!

Reddy P Rajasekhar

కొత్తిమీర వంటకు మంచి రుచిని, వాసనను ఇస్తుంది కానీ, దానిని ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవడం ఒక సవాలుతో కూడుకున్న పని. మార్కెట్ నుండి తెచ్చిన రెండు మూడు రోజులకే అది వాడిపోవడం లేదా కుళ్లిపోవడం మనం చూస్తుంటాం. అయితే కొన్ని చిన్న చిట్కాలు పాటించడం ద్వారా కొత్తిమీరను ఫ్రిజ్‌లో పెట్టినప్పటికీ వారం పది రోజుల పాటు తాజాగా, పచ్చగా ఉంచుకోవచ్చు.

ముందుగా కొత్తిమీర కట్టను తీసుకోగానే దానిలో ఉన్న పండిపోయిన ఆకులను, కుళ్లిన కాడలను వేరు చేయాలి. ఒక్క కుళ్లిన ఆకు ఉన్నా అది మిగిలిన కట్ట మొత్తాన్ని త్వరగా పాడు చేస్తుంది. ఆ తర్వాత కొత్తిమీర వేర్లను కత్తెరతో కత్తిరించుకోవాలి. కొందరు కొత్తిమీరను కడిగి ఫ్రిజ్‌లో పెడుతుంటారు, కానీ తడి ఉండటం వల్ల అది త్వరగా పాడవుతుంది. కాబట్టి కొత్తిమీరను కడగకుండానే భద్రపరచడం మంచిది. ఒకవేళ కడిగితే మాత్రం, ఆ నీరంతా పూర్తిగా ఆరిపోయే వరకు ఆరబెట్టాలి. అస్సలు తేమ లేకుండా చూసుకోవడం ఇక్కడ అత్యంత ముఖ్యం.

శుభ్రం చేసుకున్న కొత్తిమీరను ఒక పొడి కాటన్ క్లాత్‌లో గానీ లేదా పేపర్ టవల్‌లో గానీ చుట్టాలి. ఇలా చేయడం వల్ల ఆకుల్లో ఉండే అదనపు తేమను పేపర్ పీల్చుకుంటుంది. ఆ తర్వాత దానిని ఒక గాలి చొరబడని డబ్బాలో (Air tight container) పెట్టి ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవాలి. మధ్యమధ్యలో పేపర్ తడిగా అనిపిస్తే దానిని మారుస్తూ ఉండాలి. ఒకవేళ మీకు డబ్బాలు అందుబాటులో లేకపోతే, ఒక గాజు గ్లాసులో కొద్దిగా నీళ్లు పోసి, కొత్తిమీర వేర్ల వైపు నీటిలో మునిగేలా ఉంచి, పైభాగంలో ఒక ప్లాస్టిక్ కవర్‌ను వదులుగా కప్పి ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. ఇది మొక్కకు నీరు అందించినట్లుగా పనిచేసి ఆకులు వాడిపోకుండా చూస్తుంది. ఈ పద్ధతులను పాటిస్తే కొత్తిమీర ఎప్పుడూ అప్పుడే కోసినట్లు తాజాగా ఉంటుంది. కొత్తిమీర తాజాగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: