గ్యాస్ లేక వంటలు ఆగిపోతున్నాయా?.. మెట్రో నగరాల్లో ఆందోళన!
పశ్చిమాసియా (Middle East) దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయంగా గ్యాస్ సరఫరా వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది.ఇండియాకు రావాల్సిన కమర్షియల్ గ్యాస్ షిప్మెంట్లు ఆగిపోవడంతో మార్కెట్లో సిలిండర్ల కొరత తీవ్రమైంది. గ్యాస్ దొరక్కపోవడంతో హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో వేలాది రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు తాత్కాలికంగా మూతపడుతున్నాయి. గ్యాస్ లేకపోతే హోటల్ ఎలా నడుస్తుందంటూ యజమానులు లబోదిబోమంటున్నారు.
చిరు వ్యాపారుల విలవిల
పెద్ద హోటల్స్ పరిస్థితి ఎలా ఉన్నా, రోడ్డు పక్కన బండి నడుపుకునే చిన్న వ్యాపారుల పరిస్థితి దారుణంగా మారింది. అవసరానికి సిలిండర్ దొరకక, కొందరు బ్లాక్ మార్కెట్లో భారీ రేట్లకు కొంటున్నారు. కానీ ఆ భారం మోయలేక సతమతమవుతున్నారు.ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, రూమ్స్ లో ఉండే బ్యాచిలర్స్ అంతా బయట ఫుడ్ మీదే ఆధారపడతారు. ఇప్పుడు హోటళ్లు మూతపడటంతో వాళ్లకి తినడానికి తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది.
ఒకవేళ గ్యాస్ సరఫరా మళ్ళీ మొదలైనా.. సామాన్యుడికి ఊరట దక్కుతుందా అంటే అదీ లేదు!ఇప్పటికే పెరిగిన గ్యాస్ రేట్లను, సిలిండర్ కొరత వల్ల వచ్చిన నష్టాన్ని కవర్ చేయడానికి హోటల్ యజమానులు ఫుడ్ రేట్లను అమాంతం పెంచే ప్లాన్లో ఉన్నారు.రేపటి నుంచి ప్లేట్ బిర్యానీ గానీ, దోశ గానీ తినాలంటే జేబుకు గట్టిగా చిల్లు పడక తప్పదు. అంటే యుద్ధం సెగ చివరకు సామాన్యుడి కడుపుకే తగిలిందన్నమాట.
కానీ, బయట ఆకలి తీర్చే హోటళ్లు మాత్రం గ్యాస్ లేక వెలవెలబోతున్నాయి. సంక్షోభం ఎప్పుడు సర్దుమణుగుతుందో, మళ్ళీ హోటల్ పొయ్యిలు ఎప్పుడు వెలుగుతాయో అని అందరూ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.