ఏ పదార్థాలు తింటే వేడి చేస్తుంది.. ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి!

Reddy P Rajasekhar

సాధారణంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు శరీరంలో వేడి పెరిగిపోతుంటుంది. అయితే కేవలం వాతావరణం వల్లనే కాకుండా మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల కూడా శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరుగుతుంటుంది. దీనినే మనం వాడుక భాషలో 'వేడి చేయడం' అంటాం. ఇలా శరీరం వేడెక్కినప్పుడు కడుపులో మంట, మూత్ర విసర్జనలో ఇబ్బంది, మొటిమలు, నోటి పూత వంటి సమస్యలు ఎదురవుతాయి. మనం నిత్యం ఆరోగ్యకరం అనుకుని తినే కొన్ని పదార్థాలు కూడా అతిగా తీసుకుంటే శరీరంలో వేడిని కలిగిస్తాయన్నది నిజం.

ముఖ్యంగా మసాలాలు దట్టించిన ఆహారం అంటే మనందరికీ మహా ప్రీతి. కానీ బిర్యానీలు, ఇతర కారంగా ఉండే కూరల్లో వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, చెక్క వంటి దినుసులు శరీరంలో ఉష్ణాన్ని విపరీతంగా పెంచుతాయి. వీటితో పాటు మాంసాహారం, ముఖ్యంగా చికెన్ మరియు గుడ్లు తిన్నప్పుడు శరీరంలో జీవక్రియ వేగవంతమై వేడి విడుదలవుతుంది. అందుకే వేసవిలో వీటిని పరిమితంగా తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ఇక డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, వీటిలో ఉండే సహజ నూనెలు శరీరానికి వేడిని కలిగిస్తాయి. వీటిని తినేముందు కనీసం ఆరు గంటల పాటు నీళ్లలో నానబెట్టి తింటే ఆ వేడిని తగ్గించవచ్చు.

చాలామందికి తెలియని మరో విషయం ఏమిటంటే మామిడి పండ్లు. పండ్ల రాజుగా పిలవబడే మామిడి రుచిగా ఉన్నప్పటికీ ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. అందుకే మామిడి పండు తిన్న తర్వాత గ్లాసు పాలు తాగడం లేదా పండును కాసేపు నీటిలో ఉంచి తినడం మంచిది. అలాగే కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీలు కూడా శరీరంలో నీటి శాతాన్ని తగ్గించి వేడి పెరగడానికి కారణమవుతాయి. నూనెలో వేయించిన వేపుళ్లు, చిరుతిళ్లు కూడా శరీరానికి భారమై ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఈ సమస్య నుండి బయటపడాలంటే రోజుకు కనీసం మూడు లీటర్ల నీరు తాగడం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, సబ్జా గింజల వంటి చలువ చేసే పదార్థాలను మన డైట్‌లో చేర్చుకోవడం ఎంతో అవసరం. ఆహార నియమాలు పాటిస్తూ శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఆదిలోనే అరికట్టవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: