ప్రేమకు ప్రతి రూపం..అమ్మ కనిపించే దేవత అమ్మ!

Edari Rama Krishna
అమ్మ.. భాషకు అందని భావం. తానిచ్చు పాలలో ప్రేమంత కలిపి పెంచుతుంది. లాలించు పాటలో నీతి అంతా తెలిపి మంచి వాళ్లను చేస్తుంది. అమ్మ ఓ విశ్వజనీనం. ఓ నిత్య మాధుర్యం. ఓ మమతానురాగబంధం.. ఆమె అమృతం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది. ప్రపంచీకరణ మార్పుల వెల్లువలో కూడా అమ్మ బంధం చెక్కు చెదరలేదంటే అది అమ్మ ప్రేమలోని కమ్మదనానికి ఉన్న గొప్పతనమే. మనం ఎన్ని జన్మలెత్తినా ఆ మహా దేవత రుణం తీర్చుకోలేము. ఎవరు ఏది పెట్టినా తను తినక, కొంగున దాచుకుని బిడ్డలకు అందిస్తుంది తల్లి. అంతటి గొప్ప ప్రేమమూర్తి, కరుణామూర్తి అమ్మ. అమ్మ మనసు ఆకాశంకంటే విశాలమైనది, భూమికంటే సహనమైనది, తేనెకంటే మధురమైనది. 


దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడట. కష్టం వచ్చినా కన్నీళ్లొచ్చినా గుర్తొచ్చేది అమ్మే. అమ్మ ప్రేమ అమృతం లాంటిది.. మనుషులకే కాదు.. జంతువులకు కూడా  అమ్మంటే చెప్పలేని ప్రేమ.. విశ్వరహస్యాలను ఛేదించిన వాడైనా ఓ తల్లి కొడుకే. అమ్మ చనుబాలను అమృతంలా సృష్టించి.. మమకారాన్ని కలగలిపిన.. మమతల కోవెలగా అమ్మ ఒడిని మలిచి మనకు అందించాడు దేవుడు. అందుకే ఓ కవి అవతార పురుషుడైనా ఓ అమ్మ కొడుకే అంటాడు. ప్రపంచంలో ఏ భాషలో తీసిన సినిమాలో అయినా అమ్మ పాత్ర లేకుండా సినిమాలు ఉండవు. అమ్మ కనిపించే దేవత.

అందుకే ‘మాతృదేవో భవ:’ తర్వాతే తండ్రి, గురువు, దైవాలకు స్థానాలు దక్కాయి. కొత్తగా ప్రవేశపెట్టిన ‘మార్స్ ఆర్బిట్ మిషన్‌’ షార్ట్‌కర్ట్ చేస్తే ‘మామ్’ అనే పదం వస్తుంది. ఒక అద్వితీయ శక్తి ఉన్న అమ్మ శబ్దానికి పులకరించని ప్రాణి ఉండదు.  జీవితంలో అమ్మను పూరించే పవిత్ర స్థానం మరెవ్వరికి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. పసి వయసులో ప్రతి బిడ్డకు తొలి గురువు అమ్మ.

అడుగులు వేయించడం దగ్గర నుంచి అక్షరాలూ నేర్పించే వరకు అమ్మ స్థానాన్ని ప్రపంచంలోని ఏ శక్తి పూరించలేదు అమ్మ ఎప్పటికీ అమ్మే. ఆమెకు ప్రత్యామ్నాయo లేదు. ప్రపంచంలోని ఏ తల్లి కేవలం 9 నెలలు మాత్రమే అమ్మ కాదు. తన బిడ్డల భవిష్యత్ కోసం సర్వస్వం త్యాగం చేసే కరుణామూర్తి అమ్మ. అటువంటి అమ్మ నేడు దేశంలోని చాలామందికి పెద్దవాళ్ళు అయ్యాక ఒక భారమైన వస్తువుగా చూస్తున్నారు.

మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా అమ్మ ప్రేమకు మించిన ప్రేమ ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. అమ్మను గౌరవించిన వారు దేవుడిని గౌరవించినంత గొప్పఅని పెద్దవాళ్లు చెబుతుంటారు.  ఉదయాన్ని తల్లి పాదాలకు నమస్కరించి వెళితే..సకల శుభాలు జరుగుతాయని పెద్దలు చెప్పారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: