'ఇవ్వడం' మాత్రమే 'దాంపత్య పరిమళం' వ్యాపింప జేస్తుంది

ఆదర్శ దాంపత్యం అంటే లౌకిక సుఖదుఃఖాలకు అతీతమైంది. కర్మవశాత్తు వచ్చిన కష్టాలకు మానవుడు లొంగిపోకుండా దాంపత్యమనే పరమ పవిత్ర బంధాన్ని పదిలంగా కాపాడుకోవడం ముఖ్యం. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకే బాధలు తప్పలేదు. పరమేశ్వరునికి పతీ వియోగం. సతి (పార్వతి), పతి (శివుడు) కోసం తపస్సు చేయడం, పతి (శివుడు), సతి (పార్వతి) కోసం తపస్సు చేయడం విశేషం. అలానే శ్రీరామచంద్రునికే సీత ఎడబాటు తప్పలేదు. వనవాస కష్టాలను సతీ పతులిద్దరూ ఎంచుకొన్నారు, పంచుకొన్నారు. పాతివ్రత్యంతో దాంపత్య జీవనాన్ని సుఖమయం చేసుకోవడం, ఆదర్శ మూర్తులుగా లోకానికి మార్గదర్శకులు కావడం అత్రి మహర్షి, అనసూయల విషయంలో మనం గమనిస్తాం.


కాని నేటి యువత చిన్న పొరపొచ్చాలతో కాపురాలలో అడ్డుగోడలు కట్టు కొంటున్నారు. ఏదో ఒక మిషతో దంపతులు విడిగా ఉంటున్నారు. లేదా విడిపోతున్నారు. సంసార నౌక సాఫీగా సాగడానికి ఇద్దరూ బాధ్యులే. ఒకరి మీద ఒకరికి కోపం రావచ్చు. పోట్లాడుకోవచ్చు. మాట్లాడుకోకపోవచ్చు. అయితే పూర్వం పెద్దల జోక్యంతో అది సమసిపోయి సుఖజీవనం సాగించే వారు. ఇప్పుడు వేగవంతమైన, విలాసవంతమైన జీవితం వచ్చింది. కంప్యూటర్‌ పరిచయాలతో కలుసుకొని త్వరగా పెళ్లి చేసుకున్నవారు, అంతే త్వరగా చిన్న తగాదాలతో విడిపోతున్నారు. సంసారాలు చెడిపోతున్నాయి.


అసలు ఆధునిక పరిభాషలో పెళ్లి అంటే ఒక నిబద్ధత ఒక నమ్మకం. జీవితాంతం ప్రేమను పంచుతూ, ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ఉంటామనే నమ్మకంతో పెళ్లి చేసుకుంటారు. అదే నమ్మకం చివరి వరకు ఉండాలి. ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతూ ఉండాలి. సర్దుకుపోయే గుణాన్ని ఇద్దరు దమపతులు పెంపొందించు కోవాలి. ఏదైనా సందర్భంలో మీ జీవిత భాగస్వామి మీతో పోట్లాటకు సిద్ధమయితే మాట్లాడే అవకాశం వారికే ఇవ్వండి. తర్వాత సరైన సమయం చూసుకుని ఆ అంశంపై వారితో చర్చించండి. అదికూడా తప్పని సరి అయితేనే.


ప్రేమ అంటే ఇవ్వడం మాత్రమే పుచ్చుకోవతం అనే ఆలోచనే రాకూడదు. ఇష్టమైన వాళ్లకు ఇవ్వడంలోనే ప్రేమ దాగి ఉంటుంది. అలాగని ఎప్పుడూ ఒక వైపు నుంచే ఇవ్వడం అసలు మంచిది కాదు. ఇరు వైపులా ఇచ్చిపుచ్చుకోవడం ఉన్నప్పుడే ప్రేమ మరింత బలపడుతుంది. ఇద్దరికీ వేరు వేరు అభిరుచులు ఉంటాయి. తినడం దగ్గరి నుంచి పడు కోవడం, టీవీ చూడటం, డ్రెస్‌లు వేసుకోవడం వరకు వేర్వేరు అలవాట్లు ఉంటాయి. ఇవన్నీ తొలగిపోయి ఇద్దరు కలిసిమెలిసి జీవించాలంటే కొంత సమయం పడుతుంది.


అంతవరకు ఓపికగా సంసారాన్ని నెట్టుకురావాలనే విషయం మరచి పోకండి. ఈ అంశాలను గుర్తు పెట్టుకుంటే సంసారం ఎలాంటి ఒడిదుడుకు లు లేకుండా సాఫీగా సాగి పోతుంది. దాంపత్యం లోని మాధుర్యం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: