హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: సొంత పార్టీ వాళ్లే ఆనంకు ప్రత్యర్ధులా?
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేతల్లో ఆనం రామ్ నారాయణరెడ్డి కూడా ఒకరు. తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టిన ఆనం… నెల్లూరు జిల్లా రాపూర్(నియోజకవర్గాల పునర్విభజనకు ముందు) నుంచి 1985లో విజయం సాధించి...ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1991లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి 1994 ఎన్నికల్లో అదే రాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఇక 1999, 2004 ఎన్నికల్లో రాపూర్ నుంచి, 2009 ఎన్నికల్లో ఆత్మకూరు స్థానం నుంచి గెలిచి వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. ఇక 2014 ఎన్నికల తర్వాత ఆనం టీడీపీలోకి వచ్చేశారు. అయితే నాలుగేళ్ళు టీడీపీలో గడిపిన ఆనం....2018లో వైసీపీలోకి వచ్చేసి. 2019 ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి కురుగొండ్ల రామకృష్ణపై 38 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
అయితే సీనియర్ నేత కావడంతో మంత్రి పదవి వస్తుందని ఆనం ఆశించారు. కానీ జగన్ నెల్లూరులో మంత్రి పదవి అనిల్ కుమార్ యాదవ్‌కు ఇచ్చారు. ఇక వైసీపీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆనంకు...నియోజకవర్గంలో పనులు చేసుకోవడానికి అధికారులు సహకరించడం లేదని పలుమార్లు...బహిరంగంగానే విమర్శలు చేశారు. ముఖ్యంగా నీటి విషయంలో ఆనం పోరాటం చేస్తున్నారు. జిల్లాలో మంత్రి అనిల్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వర్గంతో ఆనంకు అసలు పడటం లేదు.
నీటి పారుదల శాఖ అనిల్ చేతిలో ఉండటం వల్ల, ఆనం మాట అధికారులు వినడం లేదు. ఇలా జూనియర్ నేతల చేతుల్లో పెత్తనం ఉండటంతో ఆనంకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆనం ఇటీవల మంత్రి అనిల్‌పైనే డైరక్ట్‌గా విమర్శలు చేసి సంచలనం సృష్టించారు. అనిల్ సొంత జిల్లాలోనే నీటిపారుదలకి సంబంధించిన వందల కోట్ల టెండర్లుకి అగ్రిమెంట్లే జరగలేదని, అధికార పార్టీవారు అడిగే కమిషన్లు ఇవ్వలేక కాంట్రాక్టర్లు పరారయ్యారని, నెల్లూరు సిటీ, రూరల్‌లో జరిగిన అక్రమాలపై ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా దూషిస్తున్నారని మాట్లాడారు.
ఇక సొంత పార్టీ నేతల ఆధిపత్య పోరు నడుమ వెంకటగిరిలో పెద్దగా అభివృద్ధి జరగడం లేదు. అలా అని వెంకటగిరిలో ఆనం మీద వ్యతిరేకిత ఏమి రాలేదు. ఇప్పటికీ ఆయన బలంగానే ఉన్నారు. ఇదే సమయంలో టీడీపీ నేత కురుగొండ్ల రామకృష్ణ కాస్త పుంజుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో యాక్టివ్ గానే పనిచేసుకుంటున్నారు. కానీ ఆనం బలంగా ఉండటం వల్ల, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకే మెజారిటీ స్థానాలు దక్కనున్నాయి. మొత్తానికైతే ఆనంకు టీడీపీ కంటే సొంత పార్టీ నేతలే ప్రత్యర్ధులుగా ఉన్నట్లు కనబడుతోంది.