హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కృష్ణాలో ‘ఒక్కడు’...
గన్నవరంలో గెలిచిన వల్లభనేని వంశీ టీడీపీని వీడిన విషయం తెలిసిందే. దీంతో కృష్ణాలో గద్దె ఒక్కరే టీడీపీకి మిగిలారు. ఇక గద్దె రాజకీయ జీవితం విషయానికొస్తే, 1994 ఎన్నికల్లో గద్దె గన్నవరం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 ఎన్నికల్లో టీడీపీ తరుపున విజయవాడ ఎంపీగా గెలిచారు. 2009 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన గద్దె, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు.
మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గద్దె తూర్పు నియోజకవర్గంలో బాగానే పనిచేసుకుంటున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నారు. నిత్యం నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలకు అండగా ఉంటున్నారు. ఇక ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులు అందకపోయినా సరే, ఎంపీ కేశినేని నాని ఎంపీ నిధులతో నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు.
అలాగే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై నిత్యం పోరాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా అమరావతి కోసం గట్టిగానే నిలబడుతున్నారు. పైగా విజయవాడ, అమరావతికి దగ్గర ఉండటం కలిసొచ్చే విషయం. ఇక ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కూడా బాగానే కష్టపడుతున్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలని పరిష్కరిస్తున్నారు. కాకపోతే ఎమ్మెల్యేగా ఉన్న గద్దె తూర్పులో అవినాష్ కంటే ఒక స్టెప్ ముందే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే కృష్ణా జిల్లాలో టీడీపీకి ఉన్న ఒకే ఎమ్మెల్యే గద్దె బాగానే కష్టపడుతున్నారని చెప్పొచ్చు.