హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీ కంచుకోటని నిలబెడుతున్న ఎమ్మెల్యే...
ఇక ఇక్కడ వైసీపీ జెండా ఎగిరే అవకాశం ఒక్కసారి కూడా దక్కలేదు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీదే విజయం. ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజు(కలవపూడి రాంబాబు) ప్రతిపక్షంలోనే ఉంటూ, ప్రజలకు అండగా ఉంటున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు పెద్దగా అందకపోయినా సరే తనకు సాధ్యమైన మేర పనులు చేయిస్తున్నారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గంలోని ఏదొక గ్రామంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలని తెలుసుకుంటూ, వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు.
అయితే వైసీపీ ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఉండి ప్రజలకు బాగా మేలు చేస్తున్నాయి. టీడీపీకి ఓటు వేసిన వారికి సైతం పథకాలు అందుతున్నాయి. అటు వైసీపీ నేత పివిఎల్ నరసింహరాజు అధికార నేతగా బాగానే చెలామణి అవుతున్నారు. అధికారంలో ఉండటంతో ప్రజలు కూడా ఏమన్నా పనులు ఉంటే ఆయన దగ్గరకే వెళుతున్నారు. నరసింహరాజు కూడా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు జరిగేలా చూస్తున్నారు.
ఈ నియోజకవర్గంలో ఆక్వా రైతులు ఎక్కువగానే ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆక్వా రైతులకు కరెంట్ ఛార్జీలు తగ్గించింది. అలాగే వారికి మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తుంది. అయితే ఇటీవల వరదలకు రైతులు ఎక్కువగానే నష్టపోయారు. కాళ్ళ, ఆకివీడు, పాలకోడేరు, ఉండి మండలాల్లో పంట నష్టం ఎక్కువగానే జరిగింది. వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరముంది. అటు వరదలకు రోడ్ల పరిస్థితి కూడా అధ్వాన్నంగా తయారైంది.
రాజకీయ పరంగా చూసుకుంటే నియోజకవర్గంలో టీడీపీ ఇప్పటికీ స్ట్రాంగ్‌గా ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నా సరే నియోజకవర్గ ప్రజలు టీడీపీ వైపే మొగ్గుచూపుతున్నారు. అటు ఎమ్మెల్యే మంతెన రామరాజు పనితీరు పట్ల కూడా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఉండి ఇంకా టీడీపీ కంచుకోటగానే ఉంది.