హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పయ్యావుల పట్టు కోల్పోతున్నారా?

అనంతపురం జిల్లా...ఉరవకొండ నియోజకవర్గం టీడీపీకి అనుకూలమైన నియోజకవర్గం...ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ టీడీపీ మంచి విజయాలే సాధించింది. ఇక ఇక్కడ టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ అదిరిపోయే విజయాలు సాధించారు. 1994లో గెలిచిన పయ్యావుల...అప్పటి టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా నడుచుకున్నారు. ఇక 1999లో ఓడిపోయిన కేశవ్...2004, 2009 ఎన్నికల్లో గెలిచారు. ఈ రెండుసార్లు టీడీపీ ప్రతిపక్షానికే పరిమితమైంది.

ప్రతిపక్షంలో ఉన్నా సరే కేశవ్...తనదైన శైలిలో అప్పటి వైఎస్సార్ ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. తన వాక్చాతుర్యంతో ప్రత్యర్ధులని సైతం ఆకట్టుకున్నారు. ఇక 2014లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన కేశవ్ మళ్ళీ 2019 ఎన్నికల్లో గెలిచారు. ఈసారి అధికారం వైసీపీకి దక్కింది. పైగా టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో కేశవ్ ఏపీ రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్‌గా లేరు. మునుపటి దూకుడు ఇప్పుడు లేదు. పి‌ఏసి  ఛైర్మన్‌గా ఉన్నా సరే కేశవ్, అధికార వైసీపీ మీద దూకుడుగా వెళ్ళడం లేదు.

అసలు ఓ రకంగా చెప్పాలంటే ఏపీ రాజకీయాల్లో ఈయన పెద్దగా కనబడటం లేదు. టీడీపీకి సపోర్ట్‌గా ఉంటున్నట్లు కనిపించడం లేదు. అసెంబ్లీలో సైతం బలమైన గళం వినిపించడం లేదు. ఇక నియోజకవర్గంలో ఎఫెక్టివ్‌గా పనిచేయడం లేదు. నియోజకవర్గంలో తాగునీటి సమస్యతో పాటు పలు సమస్యలు ఉన్నాయి.ఇక వైసీపీలో విశ్వేశ్వర్ రెడ్డి కీలకంగా ఉన్నారు. ప్రభుత్వం తరుపున పలు కార్యక్రమాలు చేయిస్తున్నారు.

ప్రభుత్వ పథకాలు అందుస్తున్నాయి. కొత్తగా సచివాలయాలు, హెల్త్ కేర్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో నియోజకవర్గం కాస్త వైసీపీకి అనుకూలంగా మారినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే పయ్యావులలో పవర్ తగ్గినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంపై ఆయన పట్టు కోల్పోయినట్లే కనిపిస్తున్నారు. ఎక్కువసార్లు ప్రతిపక్షానికే పరిమితం కావడం వల్లే కేశవ్ అంత దూకుడుగా కనిపించడం లేదని తెలుస్తోంది. పైగా ఈ మధ్య పార్టీలో కీలక పదవి దక్కినా కూడా కేశవ్ ఉలుకు పలుకు లేకుండానే ఉన్నారు. మరి చూడాలి ఈ సీనియర్ ఎమ్మెల్యే ఎప్పుడు యాక్టివ్ అవుతారో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: