హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?
మొదటిసారి ఎమ్మెల్యేగా తిరుగులేని నాయకురాలుగా ఎదుగుతున్న విడదల రజినికి చిలకలూరిపేటలో ఇక చెక్ పెట్టడం కష్టమే అని తెలుస్తోంది. అయితే పేట టీడీపీకి కంచుకోట. 1983, 85, 89, 1999, 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులే విజయం సాధించారు. ఇక 1994, 2004 ఎన్నికల్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్ధులు విజయం సాధించారు. అయితే టీడీపీ గెలిచిన ఆరుసార్లో మూడు సార్లు ఆ పార్టీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు గెలిచారు. 1999, 2009, 2014 ఎన్నికల్లో గెలిచారు. 2004లో కేవలం 200 ఓట్ల తేడాతో మర్రి రాజశేఖర్‌పై ఓడిపోయారు.
ఇక 2009, 14 ఎన్నికల్లో అదే మర్రి రాజశేఖర్‌ని ప్రత్తిపాటి ఓడించారు. దీంతో పేటలో ప్రత్తిపాటికి తిరుగుండదు అని అంతా భావించారు. కానీ విడదల రజిని ఎంట్రీతో ప్రత్తిపాటికి చెక్ పడింది. మొదట్లో టీడీపీలో ఉన్న విడదల రజిని, ఎన్నికల ముందు వైసీపీలో చేరి ప్రత్తిపాటిని చిత్తుగా ఓడించారు. రాజకీయాల్లో కొత్త అయినా తనదైన శైలిలో వ్యూహాలు వేసి, ప్రత్తిపాటికి చెక్ పెట్టారు. అయితే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రజిని ప్రజలకు సేవ చేయడంలో ఏ మాత్రం వెనుకడుగు వేయట్లేదు.
నిత్యం పేట ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల అందించడంలో ఆమె ముందే ఉంటున్నారు. పథకాల విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు సేవ చేయడంలో ముందున్న రజిని...ప్రతిపక్ష టీడీపీకి కౌంటర్లు ఇవ్వడంలోనూ ముందున్నారు. అటు అసెంబ్లీలో గానీ, ఇటు నియోజకవర్గంలో గానీ టీడీపీపై విరుచుకుపడుతున్నారు.
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రజినికి రాష్ట్ర స్థాయిలో మంచి క్రేజ్ వచ్చింది. ఇక పేటలో అయితే రజినికి ఎదురులేకుండా పోయింది. తాజాగా జరిగిన పంచాయితీ ఎన్నికల్లో మంచి విజయాలు సాధించారు. అలాగే చిలకలూరిపేట మున్సిపాలిటీ కూడా వైసీపీ ఖాతాలో పడేలా చేశారు. మొత్తం 38 వార్డుల్లో వైసీపీ 30 గెలిస్తే టీడీపీ 8 మాత్రమే గెలుచుకుంది. ఇక్క మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, రజినికి చెక్ పెట్టలేకపోతున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో సైతం రజిని తిరుగుండదని తెలుస్తోంది. మొత్తానికైతే పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమే.