హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఎమ్మెల్యే జగన్‌ బలం తగ్గుతుందా?

కృష్ణా జిల్లా అంటేనే తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన జిల్లా. ఈ జిల్లాలో పలు నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. అయితే 2019 ఎన్నికల్లో ఆ కంచుకోటలు బద్దలయ్యాయి. జగన్ వేవ్‌లో ఈ జిల్లాలో వైసీపీ సత్తా చాటింది. ఈ క్రమంలోనే టీడీపీకి కంచుకోటగా ఉన్న నందిగామ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగిరింది. టీడీపీ పెట్టాక ఇక్కడ జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సార్లు పసుపు జెండానే ఎగిరింది. 8సార్లు టీడీపీ గెలవగా, ఒకసారి కాంగ్రెస్ గెలిచింది.


గత ఎన్నికల్లో నందిగామలో వైసీపీ తరుపున మొండితోక జగన్ మోహన్‌రావు విజయం సాధించారు. ఎమ్మెల్యేగా జగన్ బాగానే పనిచేస్తున్నారు. నందిగామలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇక ప్రభుత్వ పథకాలు జగన్‌కు ప్లస్ అవుతున్నాయి. అటు నందిగామలో కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరిగాయి. స్వతహాగా డాక్టర్ అయినా జగన్ కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలబడ్డారు.



అయితే నందిగామలో పలు సమస్యలు ఉన్నాయి. నియోజకవర్గంలో సుబాబుల్ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. విజయవాడ నగరానికి దగ్గరలో ఉండే నందిగామ పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు. నందిగామ చుట్టూ మున్నేరు, వైరా ఏరు, కట్టెలేరు వంటి ఉప నదులు ప్రవహిస్తున్న కూడా, నేటికీ మంచినీరందని గ్రామాలు చాలా ఉన్నాయి. నందిగామ టౌన్‌లో తాగునీటి సమస్య కాస్త ఎక్కువే.


రాజకీయంగా చూసుకుంటే తమ కంచుకోటని నిలబెట్టుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుంది. టీడీపీ తరుపున తంగిరాల సౌమ్య గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు. అలాగే నియోజకవర్గంలో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇసుక, ఇళ్ల స్థలాల్లో వైసీపీ నేతలు చాలా అక్రమాలు చేశారని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్తితులని బట్టి చూస్తే టీడీపీ కాస్త పుంజుకున్నట్లే కనిపిస్తోంది. అటు ఎమ్మెల్యే జగన్ బలం తగ్గిందని తెలుస్తోంది. కాకపోతే అధికారంలో ఉండటం జగన్ అడ్వాంటేజ్. మరి వచ్చే ఎన్నికలనాటికి నందిగామలో పరిస్తితి ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: