హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ టీడీపీ ఎమ్మెల్యేకు వైసీపీ మళ్ళీ ఛాన్స్ ఇస్తుందా?

ప్రకాశం జిల్లాలో ప్రతిపక్ష టీడీపీకి కాస్త అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల్లో కొండపి కూడా ఒకటి. టీడీపీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఇక్కడ...పసుపు జెండా ఎక్కువసార్లు ఎగిరింది. ఇది 2009లో ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గంగా మారినా సరే ఇక్కడ టీడీపీ బలం తగ్గలేదు. 2009లో టీడీపీ తరుపున డోలా బాల వీరంజనేయ స్వామి పోటీ చేసి స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. ఇక 2014 ఎన్నికల్లో మంచి మెజారిటీతో డోలా ఎమ్మెల్యేగా గెలిచారు.
పైగా టీడీపీ అధికారంలోకి రావడంతో ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో బాగానే పనిచేశారు. అందుకే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ గాలి ఉన్నా సరే కొండపిలో టీడీపీ జెండా ఎగిరింది. మరోసారి డోలా ఎమ్మెల్యేగా గెలిచేశారు. అసలు రాష్ట్రంలో ఉన్న అన్నీ ఎస్సీ, ఎస్టీ రిజర్వడ్ నియోజకవర్గాల్లో సత్తా చాటిన వైసీపీ...కొండపిలో మాత్రం టీడీపీకి చెక్ పెట్టలేకపోయింది. ఇక రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన డోలా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, తనకు సాధ్యమైన మేర పని చేసుకుంటూ వెళుతున్నారు.
నిధులు సరిగ్గా అందకపోయినా ప్రజా సమస్యలని అధికారులు దృష్టికి తీసుకెళ్లి, వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. అలాగే అధినేత చంద్రబాబుకు అండగా ఉంటూ, అధికార వైసీపీపై బాగానే పోరాటం చేస్తున్నారు. మొదట్లో కాస్త సైలెంట్‌గా ఉన్నా సరే కొంతకాలం నుంచి పార్టీ తరుపున బలమైన వాయిస్ వినిపిస్తున్నారు.
అటు వైసీపీ తరుపున మాదాసి వెంకయ్య పనిచేస్తున్నారు. అధికారంలో ఉండటంతో ప్రజలకు బాగానే పనులు చేసి పెడుతున్నారు. అలాగే పార్టీని బలోపేతం చేస్తూ, ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో డోలాకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. అయితే కొండపిలో వైసీపీ-టీడీపీలు పోటాపోటిగా ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నా సరే బలంగా ఉన్న డోలాకు చెక్ పెట్టడం అంత సులువు కాదనే చెప్పొచ్చు. వచ్చే ఎన్నికల నాటికి ఉండే పరిస్తితిని కొండపిలో పార్టీల గెలుపోటములు డిసైడ్ అయ్యే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: