డబ్బే డబ్బు : అమెజాన్ గట్టి పోటీ ఇవ్వబోతున్న రిలయన్స్ !

Seetha Sailaja
ఇప్పటికే ప్రపంచ కుబేరుల లిస్టులో అగ్రస్థానంలో ఒకరుగా కొనసాగుతున్న ముకేష్ అంబాని సరికొత్త వ్యూహం ఏకంగా ప్రపంచ అగ్రగామి సంస్థ అమెజాన్ కు చుక్కలు చూపించే విధంగా మారవచ్చు అన్నసంకేతాలు వస్తున్నాయి. గత ఆర్ధిక సంవత్సరం 1.63 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిన రిలయన్స్ రిటైల్ గ్రూప్ ఫ్యూచర్ గ్రూప్ అధినేత బియానీ తో చేతులు కలపడం ఇప్పుడు పారిశ్రామిక వర్గాలలో సంచలన వార్తగా మారింది.


ఫ్యూచర్ గ్రూప్ తన సంస్థకు సంబంధించిన నిత్యావసరాలు దుస్తులు సరఫరా వ్యవస్థలకు సంబంధించిన వివిధ వ్యాపారాలను రిలయన్స్ రిటైల్ తో అనుసంధానం చేస్తూ 30 వేల కోట్ల ఒప్పందం చేసుకోబోతు ఉండటంతో భవిష్యత్ లో రిలయన్స్ సంస్థ అమెజాన్ ఇండియాకు సంబంధించిన ఈకామర్స్ విభాగానికి గట్టిపోటీ ఇస్తుంది అన్న అంచనాలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఫ్యూచర్ సంస్థకు అప్పులు సుమారు 13 వేల కోట్లకు చేరిపోవడంతో ఈ అప్పుల నుండి బయటపడటానికి ఫ్యూచర్ సంస్థ అధినేత బియానీ తనపై వస్తున్న ఋణ దాతల ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి ఇలా రిలయన్స్ సంస్థతో కలిసిపోయే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


ఈ ఒప్పందంతో ఫ్యూచర్ గ్రూప్ కు చెందిన ఋణాలు అన్నింటిని రిలయన్స్ రిటైల్ తీసుకుంటుంది. ఈ ఒప్పందంతో రిలయన్స్ రిటైల్ వాటా పెరగడమే కాకుండా రిలయన్స్ షేర్ విలువ రానున్నరోజులలో భారీగా పెరిగే ఆస్కారం ఉందని సంకేతాలు వస్తున్నాయి.


ఇప్పటికే రకరకాల వ్యాపార రంగాలలో రాణిస్తూ భారత ఆర్ధిక వ్యవస్థతతో పాటు దేశ రాజకీయాలను కూడ ప్రభావితం చేసే స్థాయికి ఎదిగిన రిలయన్స్ గ్రూప్ ఈ ఒప్పందంతో ప్రస్తుతం భారత్ లో ఏ పారిశ్రామికవేత్త అందుకోలేని స్థాయికి చేరుకుంటుందని అంటున్నారు. భవిష్యత్తులో దేశంలోని చిన్నచిన్న గ్రామాలలో కూడ ఒక జియో స్టోర్స్ ఉండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్న ముకేష్ ఆలోచనలు వాస్తవ రూపం దాలిస్తే చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే చిన్న స్థాయి కిరాణా షాపుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారనున్నది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: