డబ్బే డబ్బు : స్త్రీలకు సంపదను సృష్టించబోతున్న కరోనా వ్యాక్సిన్ !
ఇటీవల కాలం వరకు ఆకాశమే హద్దుగా దూసుకు వెళ్ళిన పసిడి ధరలకు కరోనా వ్యాక్సిన్ అడ్డుకట్టవేయడంతో గత నవంబర్ లో బంగారం ధర బాగా తగ్గుతూ వచ్చింది. ఒక పక్కన పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తున్నప్పటికీ పసిడి ధరలు గణనీయంగా పడటం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. బంగారం ధర ఇంతగా పతనం అవ్వడం ఈ మధ్య కాలంలో ఎప్పుడు జరగలేదు.
దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ లో కూడ మేలిమి బంగారానికి డిమాండ్ తగ్గడంతో బంగారం ధర రోజురోజుకు ఒక మెట్టు దిగుతోంది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు బంగారం కొనుక్కోవచ్చా అని ఆలోచనలు చేస్తున్న వారికి ఈ రంగంలో అనుభవజ్ఞులు కొన్ని సూచనలు ఇస్తున్నారు. అమెరికా చైనా ల మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో పాటు అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టి షేర్ మార్కెట్ పై ఉందని అందువల్ల గడిచిన నాలుగేళ్ళల్లో ఎప్పుడూ చూడని అధిక క్షీణతను బంగారం ఎదుర్కుంటోందనీ ఈ కారణాలతో రానున్న కొద్ది కాలంలో మేలిమి బంగారం 45 వేల స్థాయికి పడిపోయే ఆస్కారం ఉందని అందువల్ల బంగారం ధర పతనం మరికొన్ని వారాల పాటు కొనసాగుతుందని ఈ పరిస్థితులలో బంగారం కొనుక్కోవడం మంచిది అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ విజయానికి సంబంధించిన వార్తలు చాల పాజిటివ్ గా వస్తున్న పరిస్థితులలో ఒకవేళ ఊహించని విధంగా అంచనాలు తలక్రిందులు అయి కరోనా వ్యాక్సిన్ ఇప్పట్లో రాదని సంకేతాలు వస్తే మళ్ళీ బంగారం ధర పరుగులు తీయడం ఖాయం అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా భారత్ లో ప్రజల వినియోగ సూచీ 6.6 శాతం మేరకు నమోదు చేసుకోవచ్చని వస్తున్న అంచనాల రీత్యా ఎగువ మధ్యతరగతి సంపన్న వర్గాలకు సంబంధించిన చాలామంది మళ్ళీ బంగారం పై పెట్టుబడులు పెట్టే ఆలోచనలు చేస్తే బంగారంకు మళ్ళీ డిమాండ్ పెరిగి ధర పెరిగే ఆస్కారం ఉంది..