నెలకు రూ.1724 కడితే రూ.31 లక్షలు వస్తాయి
భారతీయ తపాలాశాఖ జీవితబీమా గురించి మనం తెలుసుకోవాలి. పాలసీలంటే అందరూ ఎల్ఐసీ, ఇతర ప్రయివేటు కంపెనీల పాలసీల గురించే ఆలోచిస్తారు. కానీ తపాలాశాఖ అందించే పాలసీవల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభాలుంటాయి. పదవీ విరమణ చేసిన తర్వాత ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని మీరు భావిస్తే ఇటువంటివాటిపై దృష్టిపెట్టవచ్చు.
గ్రామ్ సువిధా
ఇండియా పోస్ట్‌కు చెందిన రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ వినియోగదారుల కోసం పలు రకాల పాలసీ పథకాలను అందుబాటులోకి తెచ్చింది. వీటిల్లో చేరితో మనం ఊహించనంత లాభాలను పొందవచ్చు. వీటిల్లో గ్రామ్ సువిధా ఒకటి. దీన్ని కన్వర్టిబుల్ హోల్ లైఫ్ అస్యూరెన్స్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. పదవీ విరమణ తర్వాత ఆలోచించేవారు ఎక్కువగా ఈ బీమాను ఎంచుకోవచ్చు. 19 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు కలిగినవారు దీనికి అర్హులు. గరిష్టంగా రూ.10 లక్షల మొత్తానికి బీమా తీసుకోవచ్చు. అలాగే రూ.10 వేల బీమా మొత్తానికి కూడా పాలసీ పొందొచ్చు. పాలసీ తీసుకున్న ఐదేళ్ల తర్వాత దీన్ని ఎండోమెంట్ ప్లాన్ కిందకు మార్చుకోవడానికి అవకాశముంది. ఆరు సంవత్సరాలైతే ఎండోమెంట్ కిందకు మారే అర్హత కోల్పోతారు.
బీమా కట్టిన తర్వాత లోన్ కూడా ఇస్తారు
బీమా కట్టడం ప్రారంభమైన నాలుగేళ్ల తర్వాత లోన్ సదుపాయం కల్పిస్తారు. మూడేళ్ల తర్వాత కూడా పాలసీని సరెండర్ చేయొచ్చు. 60 ఏళ్ల తర్వాత పాలసీదారుడు జీవించి ఉంటే పాలసీ డబ్బులతోపాటు బోనస్ వంటివి కలిపి చెల్లిస్తారు. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే ఆ మొత్తాన్ని నామినీకి అందజేస్తారు. 25 ఏళ్ల వయసులో ఉన్న ఒక వ్యక్తి రూ.10 లక్షల మొత్తానికి బీమా పాలసీ తీసుకున్నారనుకుందాం. ఆ వ్యక్తి నెలకు రూ.1724 చెల్లించాల్సి ఉంటుంది. 35 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించాలి. 60 ఏళ్ల తర్వాత ఈయనకు రూ.31 లక్షలు వస్తాయి. పదవీ విరమణ తర్వాత ఏమిటంటూ జీవితానికి సంబంధించి ప్రణాళికలు వేసుకునేవారికి ఈ బీమా పథకం బాగుంటుంది.