మనీ: ఏపీ విద్యార్థులకు శుభవార్త.. ఈ పథకంలో కొత్త మార్పులు..!
విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. జగనన్న గోరుముద్దలో భాగంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు ఒకటి చొప్పున మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు అందిస్తున్నారు. ఇటీవల కొన్నిచోట్ల మధ్యాహ్న భోజనంలో అందించే గుడ్డు నాణ్యత లేకపోవడం , పాడైపోయిన గుడ్లు విద్యార్థులకు పెట్టడంతో ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ పథకంలో కీలక మార్పులు చేసింది ప్రభుత్వం. పది రోజులకు ఒకసారి పాఠశాలలకు సరఫరా చేస్తున్న గుడ్లకు బదులుగా వారానికి ఒకసారి గుడ్లను సరఫరా చేయాల్సిందిగా ఆదేశించింది.
కోడిగుడ్ల నాణ్యత చెడిపోకుండా.. తాజా గుడ్లు అందించే విధంగా వారానికి ఒకసారి కోడిగుడ్ల సరఫరా చేయాలి అని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం పై అటు తల్లిదండ్రులు ఇటు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రతి వారం వచ్చే గుడ్లకు నాలుగు రంగుల స్టాంపులు వేస్తారు. గుడ్ల సరఫరా లో అక్రమాలకు తావు లేకుండా మొదటి వారం నీలం.. రెండో వారం గులాబీ.. మూడో వారం ఆకుపచ్చ.. నాలుగవ వారం వంగ పువ్వు రంగులతో గుడ్లపై స్టాంపింగ్ చేయనున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పగడ్బందీగా నాణ్యతతో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.