వేల కోట్లు నొక్కేశారు.. మీ డబ్బు కూడా?
సుమారు లక్ష, పది లక్షలు, కోటి, వందకోట్లు రూపాయల దొంగతనం జరిగితే వామ్మో అంటాం. కానీ రూ.16వేల కోట్లకు పైగా సైబర్ నేరం జరిగినా ఇది సాధారణమైనదిగా చిత్రీకరిస్తున్నారు. పేమెంట్ గేట్ వే సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ ఖాతాను హ్యాక్ చేసి కొందరు వ్యక్తులు వివిధ బ్యాంకు ఖాతాల నుంచి రూ.16,180 కోట్ల విలువైన నగదును కొంత కాలంగా స్వాహా చేసినట్లు మహారాష్ట్రలోని థానే పోలీసులు తెలిపారు.
2023 ఏప్రిల్ లో కంపెనీ పేమెంట్ గేట్ వే ఖాతాను హ్యాక్ చేసి రూ.25 కోట్లు కొల్లగొట్టినట్లు ధానే నగరంలోని శ్రీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ మోసం చాలాకాలంగా జరుగుతోందని పోలీస్ అధికారులు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టగా రూ.16,180 కోట్లకు పైగా భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు గతంలో పలు బ్యాంకుల్లో సేల్స్ మేనేజర్ గా పనిచేశారు. చాలా కాలంగా సాగుతున్న ఈ మెగా రాకెట్ లో చాలా మంది ఉండవచ్చని.. పలు కంపెనీల వ్యక్తులను ప్రభావితం చేసే పాన్ ఇండియా శాఖలు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేరం వేల సంఖ్యలో బ్యాంకు ఖాతాలకు విస్తరించి.. అనేక ఇతర ఖాతాల్లోకి బదిలీ అయిందని భావిస్తున్నారు. నిందితుల నుంచి పలు నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది భారత దేశంలోనే అతి పెద్దదైన మోసంగా చెప్పవచ్చు