హరిలో రంగ హరీ అంటూ శ్రావ్యంగా సాగే హరినామ సంకీర్తనల మధ్య చిరూ చీకట్లను చీల్చుకుంటూ భోగి మంటల మధ్య ముచ్చటగా జరుపుకునే మూడు రోజుల పండుగ సంక్రాంతికి మన తెలుగు రాష్ట్రాలలోని తెలుగు వారంతా సంక్రాంతి లక్ష్మికి స్వాగతమిస్తున్నారు. సంక్రాంతి పండుగ అంటే అందమైన ముగ్గులలో గొబ్బిళ్ళు పెట్టడమే కాకుండా మరెన్నో ఆధ్యాత్మిక, ఖగోళ విషయాలు ఈ పండుగలో దాగి ఉన్నాయి. గ్రహ రాశిలో వచ్చే మార్పులకు సంకేతంగా సంక్రాంతి పండుగ వస్తుంది. దీనికి ఖగోళ పరమైన, అలాగే ఆధ్యాత్మిక పరమైన అర్ధాలు కూడా ఉన్నాయి.
ఒక నిర్దిష్ట యోగ ప్రక్రియ నుంచి ఈ పండగ ఆవిర్భవించింది. కానీ సాధారణ ప్రజలు వారికి అనువైన పద్ధతుల్లో దీనిని జరుపుకుంటున్నారు. యోగులు కొత్తగా, నూతనోత్తేజంతో తమ ఆధ్యాత్మిక ప్రక్రియను కొనసాగించడానికి ఈ సమయం చాలా ముఖ్యమైనది అని అంటారు. అలాగే సంసారిక జీవనంలో ఉన్న వారు కూడా తాము అనుకున్నవి సాధించడానికి ఒక సరికొత్త ప్రయత్నం ఈ పండుగనాడు చేస్తారు. భూమి సూర్యుని చుట్టూ 27 నక్షత్రాలు లేదా 108పాదాల పరిభ్రమణ పూర్తిచేసి కొత్త ఆవృతాన్ని మొదలు పెట్టటాన్ని ఈ సంక్రాంతి తెలియజేస్తుంది. సంక్రాంతికి మూలపదమైన ‘శంకర’ అనే పదం యొక్క అర్థం ‘కదలిక’. ప్రాణం అంటే కదలి కాబట్టి గ్రహ గమనాల కదిలికతో వచ్చే ఈ మకర సంక్రాంతి జ్యోతిష్య శాస్త్ర రీత్యా కూడ చాల ప్రాధాన్యతను సంతరించుకుంది.
పండుగల్లో అతి పెద్దగా జరుపుకొనే పండుగ సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందంటే చాలు పల్లె వాతావరణానికి కొత్త కాంతి వచ్చినట్లే. ఎక్కడ చూసినా ఆనందం, సంతోషం వెల్లువిరుస్తుంటుంది, పండగ సంబరాలు కనిపిస్తుంటాయి, మనకు ఉన్న చాలా పండుగలు ఒకటి రెండురోజుల మాత్రమే జరుపుకుంటాము. అయితే సంక్రాంతిని మాత్రం మూడు నాలుగు రోజులు జరుపుకుంటాము. మొదిటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమగా అయితే మరికొందరు నాల్గవ రోజుకూడా ముక్కనుమ పేరుతో సంబరాలు జరుపుకుంటారు. ముఖ్యంగా రెండవ రోజును మకర సంక్రాంతి అంటారు. పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. ఉత్తరాయణ పుణ్యదినమైన మకర సంక్రాంతి అంటేనే డూడూ బసవన్నలు, హరిదాసుల పాటలు మనకందరికీ గుర్తుకు వస్తాయి. అయితే మకర సంక్రాంతికి నిజమైన అర్థం సూర్యుడు ప్రతీ ముప్పై రోజులకు ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సమయంలో ఉత్తర ముఖంగా ప్రయాణిస్తాడు. కనుక ఈ కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు.
సంక్రాంతి నుంచే ప్రకృతిలో ప్రధానమైన మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఈ పండుగ రోజున కలవాడు లేనివారికి దాన, ధర్మాలు చేస్తారు. పండుగరోజున పల్లె ప్రాంతాల్లో గంగిరెద్దుల ఆటలు ప్రధాన వినోదంగా సాగుతాయి. అదేవిధంగా కోడి పందాలు జోరుగా సాగుతాయి. మహిళలు ఆడపిల్లలతో బొమ్మలకొలువును ఏర్పాటు చేస్తారు. ఈ పండుగలో తెలుగు వారి ఇళ్ళు అన్నీ తియ్యటి లోగిళ్ళుగా మారిపోతాయి. ప్రతి ఇంటిలోనూ అచ్చమైన తెలుగు సాంప్రదాయ పిండి వంటలు అరిసెలు, తీపి గవ్వలు, రవ్వ లడ్డూలు, కజ్జికాయలు, జంతికలు, నువ్వుల లడ్డూలు చెక్క ఒడలు ఎన్నో సాంప్రదాయ రకరకాల పిండి వంటలతో తెలుగు వారి ఇళ్ళు అన్నీ, చుట్టాల సందడితో హడావిడిగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఆఖరి రోజైన కనుమ పండుగ రోజు రైతులకు ఎంతో ముఖ్యమైనది. ఆరోజు పశువులను అందంగా అలంకరించి పూజలు చేసి పొంగలి నైవేద్యం పెట్టి ఆ పొంగలిని పశువులకు తినిపిస్తారు. ఇక సంక్రాంతి రోజున ఇచ్చే గుమ్మడి కాయ దానం వెనుక ఒక విశేష అర్ధం ఉంది ఈరోజు ఇలా దానం చేయడం వల్ల బ్రహ్మoడాన్ని విష్ణుమూర్తికి దానం చేసినట్లుగా పురాణాలు చెపుతున్నాయి.
ఇలా ఎన్నో అర్ధాలతో తెలుగు వాడిగా పుట్టిన ప్రతి వ్యక్తి పెద్ద పండుగగా చేసుకునే సంక్రాంతి శోభ ప్రతి సంవత్సరం రానురాను అంతరించి పోతున్నా తెలుగు సాంప్రదాయాలను నిలబెట్టడానికి ఎందరో తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తెలుగు భాషను మరిచిపోతున్నా కనీసం అచ్చమైన తెలుగు వారి పండుగ సంక్రాంతినాడు తెలుగు సంస్కృతిని గుర్తించుకుంటూ మనమంతా చేసుకుంటున్న ఈ సంక్రాంతి పండుగ వల్ల అయినా మన సంస్కృతి తిరిగి జీవం పోసుకుని తెలుగు వాడి ఖ్యాతిని చాటే పండుగగా సంక్రాంతి నిలవాలని కోరుకుంటూ ఎపి హెరాల్డ్ ప్రపంచంలోని తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తోంది..