కొన్నాళ్ల క్రితం వరకు టాలీవుడ్ లో నాలుగే టీమ్ లు. ఎవరి కుంపటి వారిదే. ఎవరి బ్యాచ్ లు వారివే. ఎవరి సినిమాలు వారివే. ఒకరి ఆడియో ఫంక్షన్ కు మరొకరు వచ్చేవారు కాదు. అసలు పిలిచేవారు కూడా కాదు. ఆ నాలుగు కుటుంబాల్లో ఉన్న హీరోలే.. ఆడియో ఫంక్షన్లకు, సక్సెస్ మీట్లకు, సక్సెస్ టూర్లకు, ప్రమోషన్ టూర్లకు సరిపోయేవారు. కానీ.. కొన్నాళ్లుగా సీన్ మారుతోంది. టాలీవుడ్ టాప్ హీరోలుగా చెలామణి అవుతున్న వారు.. తలో చేయి వేసి.. చిన్న హీరోలను కూడా పైకి లేపుతున్నారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఎప్పుడూ సైలెంట్ గా ఉండే హీరోలు.. ఇలాంటి వాటిలో ముందుండడం విశేషం. పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్ లాంటి వారు.. తమ సినిమాలకే కాదు.. పక్క వాళ్ల సినిమాలను కూడా ప్రమోట్ చేస్తున్నారు. నాని హీరోగా, మెహరీన్ హీరోయిన్ గా, హను రాఘవపూడి దర్శకుడిగా 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తున్న చిత్రం కృష్ణగాడి వీర ప్రేమగాధ. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఇవాళ జరగబోతోంది. దీనికి చీఫ్ గెస్ట్ గా అటెండ్ కాబోతున్నాడు ప్రిన్స్ మహేశ్. మన సూపర్ స్టార్.. ఈ బ్యానర్ లో దూకుడు, ఆగడు, వన్ నేనొక్కడినే లాంటి సినిమాలు చేశాడు. ఆ పరిచయంతో ఈ ఫంక్షన్ కి అటెండవుతున్నాడనుకోవచ్చు. అయినా.. రావాలనుకోవడం గ్రేట్ కదా. మొన్నటికి మొన్న.. తన బావ సుధీర్ బాబు భలే మంచి రోజు ఆడియో ఫంక్షన్ కి కూడా వెళ్లాడు మహేశ్. అంతకు ముందు అఖిల్ ఆడియో రిలీజ్ కి అటెండై.. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అంతకంటే ముందు.. ఆది హీరోగా వచ్చిన లవ్ లీ మూవీ ఆడియో ఫంక్షన్ కి కూడా అటెండయ్యాడు. చిన్న, పెద్ద తేడా లేకుండా తనకు తోచినంత వరకు చిన్న హీరోల సినిమాలకు అండగా నిలుస్తూ.. వాటికి క్రేజ్ తీసుకొస్తున్నాడు ప్రిన్స్.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా అంతే. మెగా ఫ్యామిలీ హీరోల ఆడియో ఫంక్షన్లకు వెళ్లినా వెళ్లకపోయినా.. తనకు నచ్చిన వారి ఆడియో ఫంక్షన్ కి మాత్రం అటెండవుతున్నాడు. నితిన్ హీరో గా వచ్చిన ఇష్క్ ఆడియో ఫంక్షన్ కి వెళ్లాడు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన సన్నాఫ్ సత్యమూర్తి మ్యూజిక్ ఫంక్షన్ కి కూడా హాజరయ్యాడు. లేటెస్ట్ గా ఈ మాటల మాంత్రికుడు నితిన్ తో అ... ఆ అనే సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ అడిగితే.. ఈఫంక్షన్ కి పవన్ కచ్చితంగా అటెండవుతాడు. ఇలా.. తనకు తోచినంతలో పవన్ కూడా బయటి సినిమాల ఆడియో ఫంక్షన్లకు హాజరవుతూ.. అభయం ఇస్తున్నాడు.
ఈ మధ్య ప్రభాస్ కూడా లోఫర్ ఆడియో ఫంక్షన్ కి వెళ్లి.. మెగా ప్రిన్స్ కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడు. జూనియర్ ఎన్టీఆర్, రవితేజ లాంటి హీరోలు కూడా.. తమకు కుదిరినంతవరకు బయటి హీరోల సినిమాలకు సపోర్ట్ ఇస్తున్నారు. కొందరు ఫంక్షన్లకు అటెండ్ కాకపోయినా.. ఆన్ లైన్ లో సపోర్ట్ చేస్తున్నారు. సినిమాలు హిట్టయితే.. ఫోన్ చేసి కంగ్రాట్స్ చెబుతున్నాడు. శ్రీమంతుడు హిట్ అయినప్పుడు మహేశ్ కి, నాన్నకు ప్రేమతో హిట్ తో జూనియర్ కి కూడా పర్సనల్ గా ఫోన్ చేసిన అభినందించాడు చెర్రీ. నిర్మాత కోసం కావొచ్చు, దర్శకుడి కోసం కావొచ్చు, హీరోతో ఉన్న ఫ్రెండ్ షిప్ కోసం కావొచ్చు. కారణం ఏదైనా.. ఇలా పెద్ద హీరోలు.. చిన్న హీరోలకు సపోర్టుగా నిలవడం మాత్రం టాలీవుడ్ లో కొత్త పరిణామం. ఈ స్నేహం ఇలాగే కొనసాగితే.. ఇండస్ట్రీ పదికాలాల పాటు పచ్చగా ఉంటుంది.