గద్దర్ వంటి ప్రజా గాయకుడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన పాటతో ప్రజా యుద్ధ నౌకగా పేరు తెచ్చుకున్న పాటగాడాయన. ప్రజాసమస్యలను, పోరాట పథ గమ్యాన్ని తన పాటతో నిర్దేశించిన పాట నాయకుడాయన. కేవలం డప్పు ఆదరువుతో ఆయన అప్పటికప్పుడే గైకట్టే పాట జనం గుండెల్లోకి బలంగా దూసుకెళ్తుంది. అందుకే ఆయనకు విప్లవిగాయకుడిగా పేరు.
అలాంటి గద్దర్ సినిమాలకు పాటలు రాశారు.. ఆయన రాశారనడం కంటే.. ఆయన పాటలను సినిమాలకు వాడుకున్నారంటే బావుంటుంది. ఒరేయ్ రిక్షా సినిమాలో నా రక్తంతో నడుపుతాను రిక్షాను.. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా.. వంటి పాటలు జనంలో బాగా పాపులర్ అయ్యాయి. సినిమాల్లో కాకుండా బయట ఆయన వందల సంఖ్యల గీతాలు రాసి పాడారు.
ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన జై బోలో తెలంగాణ చిత్రంలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్నా కాలమా.. వీర తెలంగాణమా.. ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలిసిందే. అలా తెరవెనుక పాటగాడిగా ఉన్న గద్దర్ ను తెరపైకి వేషగాడి తీసుకొచ్చారు నారాయణ మూర్తి. దండకారుణ్యం సినిమాలో ఓ ఐదు నిమిషాల వేషం అడిగి మరీ తీసుకున్నారట.
అంతేకాదు.. గద్దర్ ను తన సినిమాలో చేయమని అడిగినవారిలో చాలా పెద్ద నటులే ఉన్నారట. తాను తమ సినిమాల్లో నటిస్తే, కనిపిస్తే బాగుంటుందని అమితాబ్, రజనీకాంత్, చిరంజీవి దాకా ఎంతోమంది గద్దర్ ను అడిగారట. ఈ విషయం గద్దరే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ తన పాటకు ఉన్న పేరును క్యాష్ చేసుకోవడం ఇష్టం లేక సున్నితంగా తిరస్కరించారట గద్దర్.. అదీ సంగతి.